జూన్‌ నుంచి ‘షుగర్‌ ఫ్రీ’ ప్రసాదం!

19 May, 2019 03:00 IST|Sakshi
వేములవాడలో బెల్లంతో తయారు చేసిన గుడాన్న పొంగళి

జూన్‌ నుంచి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో బెల్లం ప్రసాదాలు

ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఆలయాల్లో సానుకూల స్పందన

దీంతో వీలైనన్ని ప్రధాన ఆలయాల్లో అమలుకు దేవాదాయశాఖ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: లడ్డూ, చక్కెర పొంగలి, రవ్వ కేసరి... గుడిలో దేవునికి నైవేద్యంగా సమర్పించాక అందించే ఇలాంటి ప్రసాదాలను భక్తులు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సిన మధుమేహ రోగులైతే తమ ‘కట్టుబాటు’ను పక్కనపెట్టి మరీ వాటిని లాగించేస్తారు. అయితే ఇప్పుడు మధుమేహం ఉన్న వారూ నిరభ్యంతరంగా ఈ ప్రసాదం స్వీకరించొచ్చు! దీనికి దేవాదాయశాఖ అభయం ఇస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటిలో ఇక నుంచి ఎంచక్కా బెల్లం ప్రసాదాలు అందుబాటులోకి వస్తున్నాయి. గుడి అనగానే ఠక్కున కనిపించేది లడ్డూ ప్రసాదం. ఇప్పుడు ఆ లడ్డూ కూడా బెల్లంతో సిద్ధమవుతోంది.

ఒక్క లడ్డూ మాత్రమే కాదు చక్కెర పొంగళి స్థానంలో బెల్లం పొంగలి, రవ్వ కేసరి లాంటివి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఇన్‌చార్జి కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రతిపాదనకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంగీకరించడంతో ప్రయోగాత్మకంగా ఇటీవలే కొన్ని దేవాలయాల్లో బెల్లం ప్రసాదాలు ప్రారంభించారు. భక్తుల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో దాన్ని విస్తరించాలని తాజాగా నిర్ణయించారు. జూన్‌ ఒకటి నుంచి వీలైనన్ని ప్రధాన దేవాలయాల్లో బెల్లం ప్రసాదాలను ప్రారంభించనున్నారు. వెరసి ఇప్పుడు దేవుడికి ‘షుగర్‌ ఫ్రీ’నైవేద్యాలు సిద్ధమన్నమాట. 

దేవుడికి ప్రీతి... భక్తులకు ‘ముక్తి’.. 
స్వామి కైంకర్యాల్లో ప్రసాద నివేదన కీలకం. మంత్రోచ్ఛరణల్లోనూ దాని ప్రస్తావన ఉంటుంది. గుడ నైవేద్యం సమర్పయామి అంటూ నివేదిస్తుంటారు. స్వామి సేవకు పేదరికం అడ్డుకాదని చెబుతూ పత్రం పుష్పం ఫలం తోయం ప్రస్తావన తెస్తారు. అదే కోవలో నైవేద్యానికి కూడా బెల్లం ముక్క చాలు అంటూంటారు. నిజానికి స్వామి–అమ్మవార్లు బెల్లం అంటే మక్కువ చూపుతారని చెప్పడం ద్వారా దేవుడు పేదల దరిలో ఉంటాడన్న నమ్మకాన్ని కలిగిస్తారు. పూర్వకాలంలో బెల్లం ప్రసాదాల వితరణ విస్తారంగా ఉన్నా రానురానూ చక్కెర ప్రాధాన్యం పెరిగింది. అన్ని ప్రసాదాలూ చక్కెరతో నిండిపోయాయి. ఇంతకాలం తర్వాత మళ్లీ దేవుళ్లు, భక్తులను బెల్లం పలకరిస్తోంది. చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడం, బెల్లంలో పోషక విలువలు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా మహిళలకు ఎంతో అవసరమైన ఇనుము అందులో ఎక్కువగా ఉండటం, పూర్వకాలంలో ప్రసాదంలో బెల్లానికి విశేష ప్రాధాన్యం ఉండటం... ఇలా అన్ని అంశాలు కలగలిపి బెల్లం ప్రసాదాలు చేయించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ నిర్ణయించారు.

ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఆయన అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే భక్తులు బెల్లం ప్రసాదాలను స్వాగతిస్తారో లేదో చూద్దామని వారం క్రితం ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల్లో ప్రారంభించారు. భద్రాచలం, వేములవాడ, బాసర, యాదగిరిగుట్టతోపాటు సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ ఆలయం, కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి గుడిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. యాదగిరిగుట్టలో చక్కెర లడ్డూలతోపాటు బెల్లం లడ్డూలు ప్రారంభించారు. ప్రస్తుతం నిత్యం దాదాపు వెయ్యి బెల్లం లడ్డూలు విక్రయిస్తున్నారు. బాసరలో కూడా అంతేమొత్తం అమ్ముతుండగా భద్రాచలంలో సాధారణ రోజుల్లో 1,500, శని, ఆదివారాల్లో 5 వేల వరకు అమ్ముతున్నారు. ఇక్కడ ఇంతకాలం అందుబాటులో ఉన్న చక్కెర పొంగళిని పూర్తిగా ఆపేసి బెల్లం పొంగళి అమ్ముతున్నారు. దీంతోపాటు రవ్వ కేసరిని కూడా బెల్లంతో చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ఇక వేములవాడలో గుడాన్న పొంగళి పేరుతో బెల్లం ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. 200 గ్రాముల బరువు తూగే పొట్లాలను కాజు, కిస్మిస్, నెయ్యి రంగరించి రుచికరంగా సిద్ధం చేస్తుండటంతో భక్తజనం సంబరంగా స్వీకరిస్తున్నారు. చక్కెర ప్రసాదం ధరలకే వీటినీ అందుబాటులో ఉంచుతున్నారు. 

భవిష్యత్తులో తయారీ పెంచుతాం... 
చక్కెరతో పోలిస్తే బెల్లం ప్రసాదం రుచిలో కొంత తేడా ఉన్నా దేవుడికి ఇష్టమైందని, ఆరోగ్యానికి మేలు చేసేదన్న ఉద్దేశంతో భక్తజనం సానుకూలంగా స్పందిస్తుండటంపట్ల అధికారులు సంబరపడుతున్నారు. ‘వేములవాడలో పొంగళికి ఎంతో ప్రాధాన్యముంది. భక్తులు ఇష్టంగా, భక్తితో దీన్ని తీసుకుంటారు. ఇప్పుడు గుడాన్న పొంగళిగా బెల్లం ప్రసాదాన్ని అందుబాటులో ఉంచడంపట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో బెల్లం ప్రసాదాల తయారీని పెంచుతాం’అని వేములవాడ కార్యనిర్వహణాధికారి రాజేశ్వర్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా