అన్నదాత కడుపుమండింది..

9 Jul, 2015 23:52 IST|Sakshi
అన్నదాత కడుపుమండింది..

- చెరకు పంటను పశువులకు మేతగా వేసిన రైతు
- ఫ్యాక్టరీకి చెరకు తరలించి ఏడునెలలైనా అందని బిల్లులు
- మెదక్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో సంఘటన
మెదక్ రూరల్:
ఏడాది కింద పండించిన చెరకు ఫ్యాక్టరీకి  తరలించిన ఆ అన్నదాతకు ఏడు నెలలు గడిచినా యాజమాన్యం బిల్లులు చెల్లించలేదు. సాగుచేసిన చెరకు పంటకు ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. భవిష్యత్తులో చెరకు ఫ్యాక్టరీ నడుస్తుందో లేదో అనే ఆందోళన. దీంతో  ఆ అన్నదాత పండించిన చెరకు పంటను పశువుల మేతగా వేశాడు.

ఈ సంఘటన మెదక్ మండలం గాజిరెడ్డిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సాపరవి గత ఏడాది మూడెకరాల్లో చెరకు పంట సాగుచేశాడు. పంటను ఫ్యాక్టరీకి తరలించిన రవికి యాజమాన్యం రూ.60వేలు ఇవ్వాల్సి ఉండగా అందులో రూ.40వేలను మాత్రమే చెల్లించింది. మరో రూ.20వేలు ఇవ్వాల్సి ఉన్నా  నేటికి చెల్లించలేదు.

ఫ్యాక్టరికి చెరకు తరలించి ఏడునెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో రైతు రవి ఆవేదనకు గురయ్యాడు. ప్రస్తుతం మూడెకరాల్లో చెరకు పంట మోడం అలాగే ఉంది. కాగా నేటికీ పంటను ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో కడుపు మండిన రైతు చేనులోకి పశువులను తోలి మేపించాడు. జిల్లాలోని వేలాది మంది  రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. అనంతరం రవి విలేకరులతో మాట్లాడుతూ  ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా  స్వాధీనం చేసుకోనందునే తనలాంటి రైతులకు ఈ పరిస్థితి ఎదురైందన్నారు.

మరిన్ని వార్తలు