గానుగాడేనా?

24 Aug, 2014 23:26 IST|Sakshi

తీపి చెరకును పండించే  రైతుల బతుకులు చేదుగా మారుతున్నాయి. సీజన్ ముంచుకొస్తున్నా... అందుబాటులో ఉన్న ఎన్డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీ ఈయేడు నడుస్తుందో? లేదో తెలియని సందిగ్ధంలో చెరకు రైతులు ఉన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలన్న మంత్రుల కమిటీ నివేదిక అమలుకు నోచుకుంటుందా? లేక పాత యాజమాన్యమే నడిపిస్తుందా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు ఇక్కడ పండించిన చెరకును బోధన్‌కు తరలిస్తారన్న ప్రచారం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.  
 
మెదక్: మెతుకుసీమలోని 12 మండలాల చెరకు రైతుల ప్రయోజనార్థం మంభోజిపల్లిలో నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ సేవలందిస్తోంది. ఇప్పటివరకు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గత జనవరి 17న అప్పటి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పట్లో టీఆర్‌ఎస్ కూడా ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేసింది. అయితే అప్పటికే 2014-15 సంవత్సరానికి సంబంధించి యాజమాన్యంతో చెరకు రైతులు అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో ఈయేడు
 ప్రభుత్వపరమయ్యే సూచనలు కనిపించడం లేదు. కాగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యమే ఫ్యాక్టరీని నడపాలని ఇటీవల మెదక్‌కు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
 
ముందుకు సాగని మర మ్మతులు:
సాధారణంగా ప్రతియేడు నవంబర్‌లో చెరకు క్రషింగ్ ప్రారంభమవుతోంది. అయితే ఫ్యాక్టరీని మరమ్మతులు చేయడానికి సుమారు రెండు నెలలు పడుతుందని సమాచారం. కాని ఇంతవరకు మరమ్మతులు మొదలు కాలేదని రైతులు చెబుతున్నారు. పైగా ఫ్యాక్టరీతో చెరకు అగ్రిమెంట్లు ఉన్న వివరాలను తిరిగి సేకరిస్తున్నారని వారు తెలిపారు. దీంతో క్రషింగ్ కోసం ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది బోనస్‌కు సంబంధించి బకాయిపడ్డ రూ.4 కోట్లను వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
 
బోధన్ కేంద్రంగా మూడు ఫ్యాక్టరీల క్రషింగ్?
తెలంగాణ పరిధిలోని మంభోజిపల్లి, బోధన్, మెట్‌పల్లి ఫ్యాక్టరీలు ఒకే ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్నాయి. వీటికింద ఈయేడు సుమారు 3 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతియేటా ఈ మూడు ఫ్యాక్టరీలను మరమ్మతులు చేసి నడపాలంటే సుమారు రూ.18 కోట్లనుంచి 20 కోట్ల ఖర్చు వస్తుందని రైతు నాయకులు చెబుతున్నారు. అందుకే బోధన్ ఫ్యాక్టరీని ప్రారంభించి మిగతా రెండు ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును అక్కడికి తరలిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
చెరకును నరికి దూర ప్రాంతాలకు తరలించడం వల్ల రవాణాలో జాప్యం జరగడం వల్ల తూకంలో నష్టం వాటిల్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వమే చక్కెర ఫ్యాక్టరీని నడపాలని చెరకు రైతుల పోరాట సమితి కార్యదర్శి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డికి కూడా విన్నవించామన్నారు.
 
ఎలాంటి ఆదేశాలు రాలేదు
ఈయేడు క్రషింగ్ విషయంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. గత యేడాది చెరకు బిల్లులు చెల్లించాం. బోనస్ బిల్లులు మాత్రమే చెల్లించాల్సి ఉంది.
- నాగరాజు, జీఎం, ఎన్డీఎస్‌ఎల్, మంభోజిపల్లి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా