‘పెట్టుబడి’ పంపిణీకి సర్వం సిద్ధం 

9 May, 2018 02:42 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి. చిత్రంలో మహమూద్‌ అలీ తదితరులు

       రైతుబంధు చెక్కుల అందజేతకు పక్కా ఏర్పాట్లు: డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

      ప్రతిపక్షాలవి అర్థం లేని ఆరోపణలు: గుత్తా  

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచి వాలయంలో రైతుబంధు, రైతు పాస్‌పుస్తకాల పంపిణీపై మీడియా సమావేశం జరిగింది. మహమూద్‌ అలీ మాట్లాడుతూ దేశంలో ఎవరూ చేయలేని పనిని సీఎం కేసీఆర్‌ రైతుల కోసం రైతుబంధు పేరుతో చేస్తున్నారన్నారు.

ఈ నెల 10న హుజూరాబాద్‌లో రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. 1.4 కోట్ల ఎకరాలకు 58.06 లక్షల చెక్కులు, రూ.5,608.09 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. ముందుగా 1.3 కోట్ల ఎకరాల్లో 56.14 లక్షల ఎకరాలకు 5,392.29 కోట్లు పంపిణీ చేస్తారన్నారు. మొత్తం 10,823 గ్రామాల్లో పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, పంచాయతీరాజ్‌ బిల్డింగ్, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా మంచినీళ్లు, టెంట్‌ లాంటివి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

చెక్కులు రైతుకే ఇవ్వాలని, రైతు అక్కడికి రాకుంటే రైతు ఇంటికెళ్లి చెక్కులు ఇవ్వాలని సూచించామన్నారు. పాస్‌పుస్తకాల ముద్రణకు 8 కంపెనీలు ముందుకొచ్చాయని, టెండర్ల ద్వారా ఈ–ప్రక్రియ జరిగిందన్నారు. ముద్రణ టెండర్‌ను మద్రాసు కంపెనీ దక్కించుకుందన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లా డుతూ రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వాలన్నది కేసీఆర్‌ గొప్ప ఆలోచనని కొనియాడారు. పాస్‌పుస్తకాల ముద్రణలో కొన్ని తప్పులుంటే వాటిని కలెక్టర్‌ కార్యాలయంలో సవరిస్తారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని తేల్చి చెప్పారు. దీన్ని మీడియా భూతద్దంలో చూపొద్దని, ఈ గొప్ప కార్యక్రమంలో మీడియా కూడా పాలుపంచుకోవాలని కోరారు.

ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌లైసెన్స్, ఓటర్‌ ఐడీకార్డు చూపించి రైతుబంధు చెక్, పాస్‌పుస్తకాలు తీసుకోవచ్చని అన్నారు. మొత్తం రూ.90 కోట్లతో ముద్రణ జరిగితే 80 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. వ్యవసాయం చేయనివాడు చెట్టుమీద ఉండి ఏదైనా మాట్లాడొచ్చని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎనిమిది జాతీయ బ్యాంకుల ద్వారా డబ్బులు సమకూర్చామని అన్నారు. మూడు నెలల్లోపు రైతు ఎప్పుడైనా చెక్‌ను బ్యాంకులో వేసుకోవచ్చని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ఈ ఎనిమిది రోజుల కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు, సభ్యులు పాల్గొంటారన్నారు.  

మరిన్ని వార్తలు