ఆత్మహత్య పరిష్కారం కాదు

10 Sep, 2015 17:37 IST|Sakshi

వనపర్తి (మహబూబ్‌నగర్ జిల్లా): ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవారిని అనాథలను చేయటం తప్ప ఏం సాధించలేమని సామాజిక కార్యకర్త పోచ రవిందర్‌రెడ్డి అన్నారు. కరువు ప్రభావంతో వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రోజు రోజుకు పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలను కొంత వరకు అయినా తగ్గించేందుకు పోచ అడుగు ముందుకు వేశాడు. రైతులకు తన వంతుగా ధైర్యాన్ని నింపే మాటలు నాలుగు చెప్పి వారికి కుటుంబంపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గురువారం వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో రైతులకు ఆత్మహత్యలతో కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు.

రైతులకు అండగా ఉండటం సమాజంలో ప్రతి ఒక్కరి సామాజిక బాద్యతగా భావించాల్సిన పాలకులు,అధికారులు రైతు సంక్షేమాన్ని విస్మరించటంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా రైతు సంక్షేమం మన అందరి బాధ్యత అని గుర్తించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షులు డి. శంకర్‌రావు, వనపర్తి జెడ్పీటీసీ సభ్యలు వెంకటయ్య, సర్పంచు విష్ణుయాదవ్ రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు