రాజకీయ వ్యవస్థ లోపాల వల్లే ఆత్మహత్యలు

14 Dec, 2015 03:47 IST|Sakshi
రాజకీయ వ్యవస్థ లోపాల వల్లే ఆత్మహత్యలు

♦ ‘పాలమూరు రైతుగోస’ సభలో ప్రొఫెసర్ హరగోపాల్
♦ రాజకీయ వ్యవస్థపై రైతులు యుద్ధం చేస్తారని హెచ్చరిక
♦ ఆత్మహత్యలపై పరిష్కార మార్గాలు చూపండి:రామచంద్రమూర్తి
♦ పార్లమెంట్‌లో రైతు సమస్యపై చర్చించరా?: కృష్ణారావు
 
 పాలమూరు: లోపభూయిష్టమైన రాజకీయ వ్యవస్థ తీరు వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో జరిగిన ‘పాలమూరు రైతు గోస కవిగాయక సభ’లో మాట్లాడారు.  విజన్‌లేని రాజకీయ వ్యవస్థ వల్లే వ్యవసాయరంగం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందన్నారు.   జీవనాన్ని కోల్పోతున్న రైతులు రాజకీయ వ్యవస్థపై యుద్ధం చేస్తారని. అయితే ఆ యుద్ధం రావొద్దనే ఉద్దేశంతోనే పాలమూరు అధ్యయన వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు.

సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై లోతుగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను ప్రభుత్వాలకు చూపాల్సిన అవసరం ఉం దన్నారు.  ఈ సభను చూస్తుంటే 2002లో గుజ రాత్ మారణహోమం జరిగినప్పుడు 30 మందికవులు అక్కడికి వెళ్లి అక్కడి పరిస్థితులను సమాజం దృష్టికి తీసుకొచ్చిన ఘటన గుర్తుకు వస్తుందని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇటీవల కోర్టుకు ఒకే విధమైన అఫిడవిట్‌ను సమర్పిం చాయని తెలిపారు. పిల్లలను చదివించలేక, పెళ్లిళ్లు చేయలేక, ఆత్మహత్య చేసుకుంటున్నారని దానిలో పేర్కొన్నారని వెల్లడించారు.

ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిప్యూటీ రెసిడెంట్ ఎడిటర్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీ ఒక కుట్ర ప్రాంతంగా మారిం దన్నారు. రైతు ఆత్మహత్యలపై పార్లమెంట్‌లో కనీస చర్చ లేదన్నారు. రైతు ఆత్మహత్యలపై పాలకులు దుర్మార్గంగా ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కరువుచిత్రాలు, రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను  హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రారంభించారు. రైతుగోసపై కవులు కవితలు వినిపించారు. కార్యక్రమంలో అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, సభ్యులు, కవులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు