ఈడీది తొందరపాటు చర్య 

26 Nov, 2018 01:31 IST|Sakshi

     డమ్మీ కంపెనీలంటే ఏంటో నాకు తెలియదు 

     ఈడీ సోదాలు హాస్యాస్పదం: టీడీపీ ఎంపీ సుజనా చౌదరి 

సాక్షి, హైదరాబాద్‌: సుజనా కంపెనీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను 2008లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి లావాదేవీలకు పాల్పడలేదని టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి స్పష్టంచేశారు. ఎలాంటి ఆడిటింగ్, బ్యాలెన్స్‌ షీట్లు చెక్‌ చేయకుండా ఈడీ తొందరపాటు చర్యకు పాల్పడిందని సుజనా ఆరోపించారు. మాజీ సీబీఐ డైరెక్టర్‌ విజయరామారావు కుమారుడు శ్రీనివాస్‌ కళ్యాణ్‌ తనకు స్నేహితుడు మాత్రమేనని, ఆయన కంపెనీలో తాను డైరెక్టర్‌ను కాదని, తన మిత్రులు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. శుక్ర, శనివారాల్లో తన కార్యాలయంతో పాటు ఇళ్లలో ఈడీ సోదాలు జరిపి విడుదల చేసిన అంశాలపై ఆయన ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం తాను కంపెనీలు స్థాపించానని, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేవరకు తన కంపెనీల గురించి బయటకు తెలియదన్నారు.

2008 నుంచి తన పేరు మీద ఎలాంటి కంపెనీలు లేవని, సుజనా గ్రూపులో ఉన్న కంపెనీలు తన సంబంధీకుల పేర్ల మీదకు ఎప్పుడో మారిపోయాయని తెలిపారు. అదే విధంగా తన కంపెనీలపై బ్యాంకు రుణాలున్నాయని, ఆ విషయం సివిల్‌ వ్యవహారమని, అయినా తన కంపెనీల్లో ఎలాంటి స్మగ్లింగ్‌ రవాణా, సంఘ విద్రోహ కార్యక్రమాలు జరగడం లేదన్నారు. పైగా ఒక్క రోజులోనే 30 ఏళ్ల కంపెనీ వ్యవహారాలు ఎలా పరిశీలించారో ఈడీ చెప్పాలని, ఒక్క రోజులోనే 120 కంపెనీలున్నాయని, అందులో రూ.6,000 కోట్ల రుణం ఎగవేసినట్లు ఎలా నిరూపిస్తారని అన్నారు.

తనకు డమ్మీ కంపెనీలు, షెల్‌ కంపెనీలంటే ఏంటో కూడా తెలియదని ఈడీపై సుజనా ఎదురుదాడికి దిగారు. ఈడీ జారీచేసిన సమన్లపై పార్లమెంట్‌ సమావేశాల అనంతరం విచారణకు హాజరవుతానని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సుజనా గ్రూప్‌లోని కంపెనీలు ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం లేదని, డైరెక్టర్లు, న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం కేసు వివరాలపై క్లారిటీ ఇస్తామన్నారు. 

మరిన్ని వార్తలు