ఏప్రిల్‌ 13 నుంచే వేసవి సెలవులు

30 Aug, 2017 01:03 IST|Sakshi
ఏప్రిల్‌ 13 నుంచే వేసవి సెలవులు
జూన్‌ 1న పాఠశాలలు పునః ప్రారంభం
- పాఠశాల విద్యా కేలండర్‌ జారీ
2018 ఫిబ్రవరి 28లోగా టెన్త్‌ ప్రీఫైనల్‌ పరీక్షలు పూర్తి
వచ్చే నెల 20 నుంచి అక్టోబరు 4 వరకు దసరా సెలవులు
ఉన్నత పాఠశాలల్లో ఆప్షనల్‌ హాలిడేల వినియోగంపై నిబంధనలు
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాఠశాల విద్యా కేలండర్‌ జారీ అయింది. పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేలా కొత్తగా అకడమిక్‌ కేలండర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేలండర్‌ ప్రకారం.. 2017–18 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్‌ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ 1న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇక కేలండర్‌ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు జనవరి 31వ తేదీలోగా పాఠ్యాంశాల బోధన పూర్తి చేసి.. రివిజన్‌ ప్రారంభించాలి. ఫిబ్రవరి 28లోగా ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలి. 
 
విద్యా కేలండర్‌లోని ప్రధాన అంశాలు
ఉన్నత పాఠశాలలు ఆప్షనల్‌ హాలిడేస్‌ వినియోగించుకునే విషయంలో నిబంధనలు పాటించాలి. గతంలో మాదిరిగా టీచర్లంతా ఆప్షనల్‌ హాలిడేస్‌ తీసుకుని.. పాఠశాలకు సెలవు ఇవ్వడానికి వీల్లేదు. ప్రధానోపాధ్యాయుడు గరిష్టంగా పాఠశాలలోని 30 శాతం మంది టీచర్లకే ఆప్షనల్‌ హాలిడేస్‌ను మం జూరు చేయాలి. మిగతా వారితో పాఠశాలను కొనసాగించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రం గతంలో తరహాలో పాఠశాలకు సెలవు ఇవ్వొచ్చు. 
అక్టోబర్‌లో జాతీయ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... సెప్టెంబర్‌ 2లోగా మండల, డివిజన్‌ స్థాయి, సెప్టెంబర్‌ 20లోగా జిల్లా స్థాయి గేమ్స్‌ పూర్తి చేయాలి. అక్టోబర్‌ 4వ తేదీలోగా రాష్ట్ర స్థాయిలో గేమ్స్‌ పూర్తి చేసి.. జాతీయ స్థాయికి ఎంపికైన టీములను పంపించాలి. 
పాఠశాల వార్షిక దినోత్సవాన్ని జనవరి/ఫిబ్రవరిలో, బాలసభను ప్రతి నెల 4వ శనివారం, మాస్‌ డ్రిల్‌/యోగాను ప్రతి నెల మొదటి, మూడో శనివారం నిర్వహించాలి. 
 
సెలవులివీ.. 
20–9–2017 నుంచి 4–10–2017 వరకు దసరా సెలవులు
24–12–2017 నుంచి 28–12–2017 వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్‌మస్‌ సెలవులు 
12–1–2018 నుంచి 16–1–2018 వరకు మిషనరీ స్కూళ్లు మినహా ఇతర పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 
 
డిజిటల్‌ తరగతుల షెడ్యూల్‌ ఇదీ.. 
10వ తరగతి : ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు 
9వ తరగతి : ఉదయం 11:30 నుంచి 12:15 వరకు 
8వ తరగతి : మధ్యాహ్నం 2 నుంచి 2:45 వరకు 
7వ తరగతి : 2:45 నుంచి 3:30 వరకు 
6వ తరగతి : 3:40 నుంచి 4:20 వరకు
 
పాఠశాలల వేళలు
ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 వరకు. 
ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి 
సాయంత్రం 4 గంటల వరకు. 
ప్రాథమిక పాఠశాలలు: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు.

పరీక్షల షెడ్యూలు ఇలా..
31–7–2017లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1
19–9–2017లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2
23–10–2017 నుంచి 28–10–2017 వరకు: సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 
30–11–2017లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–3
31–1–2018లోగా: టెన్త్‌ విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–4
28–2–2018లోగా: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–4
2–4–2018 నుంచి 9–4–2018 వరకు: సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2
10–4–2018న: జవాబు పత్రాల అందజేత
11–4–2018న: తల్లిదండ్రులతో సమావేశం, ప్రోగ్రెస్‌ కార్డుల అందజేత 
(పదోతరగతి వారికి 28–2–2018లోగా ప్రీఫైనల్‌ పరీక్షలు.. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు) 
>
మరిన్ని వార్తలు