సమ్మర్‌ ‘జిమ్‌దగీ’

16 Apr, 2019 07:30 IST|Sakshi

వేసవిలో ఇలా.. లైఫ్‌ లలలా..

ఎక్సర్‌సైజ్‌లతో బాడీ ఫిట్‌నెస్‌

ఎండాకాలంలో జాగ్రత్తలు ముఖ్యం  

ఫిట్‌నెస్‌ ట్రైనర్ల సూచనలు, సలహాలు

సాక్షి, సిటీబ్యూరో :ఓ వైపు ఫిట్‌నెస్‌ ఫీవర్‌ కారణంగా సిటీటెంపరేచర్‌తో ఉంది. మరోవైపు సమ్మర్‌ సీజన్‌ శరీరాల్ని హీటెక్కించేస్తోంది. వారంలో రెండు మూడు రోజులతో సరిపెట్టేవారు మాత్రమే కాదు ఒక్క రోజు కూడా జిమ్‌కి డుమ్మా కొట్టడానికి ఇష్టపడని వారూ సిటీలో ఎక్కువే.ఈ నేపథ్యంలో.. హాట్‌ సమ్మర్‌లో ‘జిమ్‌దగీ’ ఎలా ఉండాలో వివరిస్తున్నారు నగరానికి చెందిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఎం.వెంకట్‌.

వెయిట్‌లాస్‌కి ప్లస్‌...
చలికాలం, వానాకాలంతో పోలిస్తే వేసవిలో శరీరం త్వరగా వార్మప్‌ అవుతుంది.  ‘శారీరక శ్రమ, మరో వైపు వేడిగాలి బాడీ టెంపరేచర్‌ను పెంచుతాయి. ఈ వేడి దేహమంతా విస్తరించేందుకు చర్మం ద్వారా రక్తం అధికంగా సరఫరా అవుతుంది.  ఇది గుండె కొట్టుకునే స్థాయిని పెంచుతుంది. దీంతో బాడీ టెంపరేచర్‌ సాధారణ స్థాయికన్నా పెరుగుతుంది. ఈ పరిస్థితి కేలరీలు అధికంగా ఖర్చయ్యేందుకు, మరింత వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి ఈ సీజన్‌ వెయిట్‌ లాస్‌ కోరుకునేవారికి ప్లస్‌ అవుతుంది.  

నిదానమే సరైన విధానం...
ఈ సీజన్‌లో వ్యాయామం స్లోగానే స్టార్ట్‌ చేసి దశలవారీగా వేగం పెంచాలి. ఏదేమైనా కొంత వేగాన్ని నియంత్రించడం అవసరమే. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు అధికంగా చేసేవాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాహం అనిపించకపోయినా సరే వ్యాయామ సమయంలో తరచూ నీళ్లు తాగుతుండాలి.  

వెదర్‌.. చూడాలి బ్రదర్‌..
మిట్టమధ్యాహ్నపు ఎండలో ఏసీ జిమ్‌లో అయినా సరే ఎక్సర్‌సైజ్‌లు చేయడం అంతగా మంచిది కాదు. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే వ్యాయామం చేయడం సముచితం.  బలహీనత, తలనొప్పి, తలతిరగడం, ఒళ్లు పట్టేయడం వాంతులు, గుండె మరీ ఎక్కువగా కొట్టుకోవడం, తీవ్రమైన అలసటకు సంబంధించిన సూచనలు కనిపించినట్లయితే  వెంటనే వ్యాయామం ఆపేసి, చల్లని ప్రదేశంలో, నీడలో సేదతీరడం అవసరం.  వ్యాయామానంతరం చన్నీటి స్నానం చేస్తే అలసిన కండరాలకు చక్కగా సేదతీరే అవకాశం లభిస్తుంది.  

సీజన్‌కి...నప్పేవి
ఈ సీజన్‌లో శరీరం సహజంగానే కొంత ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి బాగా ఒత్తిడికి గురిచేసే క్రాస్‌ ఫిట్‌ శైలి వ్యాయామాలు టైర్, హామర్‌తో, బాటిల్‌ రోప్‌తో చేసే వర్కవుట్స్‌ని బాగా తగ్గించేయాలి. శరీరం వార్మప్‌  అయి ఉంటుంది కాబట్టి మజిల్‌ టోనింగ్‌ మీద దృష్టి పెట్టాలి. స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ చేస్తూనే కార్డియో వ్యాయామాలకు బదులుగా క్రంచెస్, పుషప్స్, బర్పీస్, ఇంచ్‌వామ్,  మౌంటెయిన్‌ క్‌లైంబర్స్, స్పాట్‌ జాగింగ్‌ వంటివి ఎంచుకోవాలి.

డీహైడ్రేషన్‌ దరిచేరకుండా...
రోజు మొత్తం మీద కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలి. చెమట ద్వారా కోల్పోయే సోడియం, పొటాíషియం, క్లోరైడ్‌లను భర్తీ చేసేందుకు వ్యాయామానికి ముందు పొటాసియం అధికంగా ఉండే అరటి, దానిమ్మ పండ్లు వంటివి తీసుకోవాలి. అవసరమైతే ఓఆర్‌ఎస్‌ వంటి సప్లిమెంట్స్‌ని వర్కవుట్స్‌ చేసే సమయంలో వినియోగించడం మంచిది. స్పోర్ట్స్‌ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఆశ్రయించవచ్చు. కాఫీ, టీ, ఆల్కహాల్‌ వల్ల దేహంలోని నీటిస్థాయి ఆవిరై వ్యాయామ సమయంలో త్వరగా అలసిపోతాం. వాటికి ఈ సీజన్‌లో తప్పనిసరిగా గుడ్‌బై చెప్పాల్సిందే.  

వెయిట్‌లాస్‌కి బెస్ట్‌...
కొంత మంది వేసవి సీజన్‌లో వేడికి భయపడి వర్కవుట్స్‌ మానేస్తారు. అయితే సరిగ్గా వినియోగించుకుంటే ఇది మజిల్‌ టోనింగ్‌కి, ముఖ్యంగా వెయిట్‌లాస్‌కి అత్యంత ఉపయుక్తమైన సీజన్‌. డ్రైఫిట్‌ దుస్తులు ధరించడం దగ్గర్నుంచి స్వల్ప మార్పు చేర్పులతో ఈ సీజన్‌లో వర్కవుట్స్‌ని ఎంజాయ్‌ చేయవచ్చు.     – ఎం.వెంకట్, ట్రైనర్,    టార్క్‌ ఫిట్‌నెస్‌ స్టూడియో

మరిన్ని వార్తలు