చల్లదనానికే సిటీజనుల మొగ్గు!

25 Mar, 2019 12:15 IST|Sakshi

వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూయిస్తున్నాడు. ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేసవిని ఎదుర్కొనేందుకు నగరవాసులు ముందస్తు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూలర్లు, ఏసీలకు డిమాండ్‌ పెరిగింది. ఏసీల వినియోగం ఇతరత్రా అంశాలపై ఆన్‌ డిమాండ్‌ సర్వీసెస్‌ మార్కెట్‌ ప్లేస్‌ అర్బన్‌ క్లాప్‌ అనే సంస్థ చేసిన ఓ అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

సాక్షి సిటీబ్యూరో: వేసవిలో వినియోగించి ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు. చాలా నెలల తర్వాత తిరిగి వినియోగించే ముందు కూలర్‌ ఏసీలకు సర్వీసింగ్‌ తప్పనిసరి. ఇప్పటికే ఇళ్లలో ఉన్నవారు వాటి మరమ్మతుల కోసం చూస్తున్నారు. కూలరైనా, ఏసీ అయినా 90 శాతంపైగా మంది వేసవిలోనే వాడుతున్నారు. నగరంలో ఏసీల వినియోగం పెరిగిపోతుంది. ఇప్పటికే ఏసీ మెయిన్‌టెనెన్స్‌ కోసం ఎలక్ట్రీషియన్‌ని పిలిపించిన వారు కొందరైతే, ఆ లైన్‌లో ఉన్నవారు మరికొందరు. ఏసీల వినియోగం ఏ విధంగా ఉంటుందన్న అంశమై ఆన్‌ డిమాండ్‌ సర్వీసెస్‌ మార్కెట్‌ ప్లేస్‌ అర్బన్‌ క్లాప్‌ అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది. దాదాపు 84 శాతం మంది తాము ప్రతి వేసవిలోనూ కనీసం ఒక్కమారైనా ఏసీ మరమ్మతు సేవలను వినియోగించుకుంటున్నారని తేలింది. దేశవ్యాప్తంగా ఏసీలను అధికంగా వినియోగిస్తున్న నగరాలలో హైదరాబాద్‌ ఒకటి. అందుకే పేరొందిన బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తి తొలి ఆవిష్కరణలూ ఇక్కడే చేయడం ఎక్కువైంది.

ఎయిర్‌ కూలర్‌.. ఎయిర్‌ కండీషన్‌..ఏది బెస్ట్‌ అంటే...
ఎయిర్‌ కూలర్‌.. ఎయిర్‌ కండీషన్‌.. ఏది బెస్ట్‌ అంటే నగరవాసులు మాత్రం ఎయిర్‌ కండీషన్‌కే ఓటేస్తున్నారు. దాదాపు 19 శాతం మంది ఈ వేసవిలో ఏసీ కొనుగోలు చేస్తామంటుంటే, 5 మంది మాత్రం అద్దెకు తీసుకుంటామంటున్నారు. అయితే, ఏసీ కండీషన్‌లో ఉంటేనే విద్యుత్‌ బిల్‌ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. నగరంలో గత వేసవిలో ప్రతి ఒక్కరూ తాము సాధారణంగా వేసవిలో చెల్లించే కరెంట్‌ బిల్లుతో పోలిస్తే చాలా ఎక్కువగానే చెల్లించామంటున్నారు. దాదాపు 37 శాతం మంది రూ. రూ. 1,500 నుంచి రూ. 3 వేలు కరెంట్‌ బిల్లు చెల్లిస్తే, 17 శాతం మంది రూ. 3 వేల నుంచి రూ. 5 వేల బిల్లు చెల్లించారు. 10 శాతం మంది రూ. 5 వేలకు పైగానే బిల్లు చెల్లించామని చెబుతున్నారు. 

ప్రతి పదిళ్లలో మూడింట ఏసీలు..
సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది ఒక ఏసీ ఉందని చెప్పారు. రెండు ఏసీలు ఉన్నాయన్నవారు 25 శాతం కాగా, మూడు ఏసీలున్న వారు 15 శాతం మంది ఉన్నారు. మూడు కన్నా ఎక్కువ ఏసీలు వాడుతున్న వారు 14 శాతం ఉన్నారు. అద్దెకు ఏసీలను తీసుకునే వారు 10 శాతం వరకు ఉంటారని తేలింది. నగరం మొత్తం మీద 40 శాతం ఇళ్లలో కనీసం ఒక్క ఏసీ కామన్‌గా మారిం దని అర్బన్‌ క్లాప్‌ అధ్యయనం వెల్లడిస్తోంది.

ఏడు గంటలు ఏసీ వినియోగం
నగరంలో 29 శాతం మంది రాత్రంతా అంటే సుమారు 7 గంటలు ఏసీ వాడుతున్నామని చెబుతున్నారు. అందువల్లే మరమ్మతులు కూడా అధికంగానే ఉంటున్నాయని చెబుతోంది అర్బన్‌ క్లాప్‌ అధ్యయనం. తమ అధ్యయనంలో 31 శాతం మంది వేసవి సీజన్‌లో తమ ఏసీ ఒకటికన్నా ఎక్కువసార్లే బ్రేక్‌ డౌన్‌ అయిందంటున్నారు. 82 శాతం మంది అయితే సీజన్‌ ప్రారంభానికి ముందే మరమ్మతులు చేయించుకుంటున్నారు. నాణ్యమైన ఏసీ సర్వీసింగ్‌కు రూ. వెయ్యి వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. దాదాపు 26 శాతం మంది ఈ తరహాలోనే ఆలోచిస్తున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది.

తక్కువ కరెంట్‌కే ఓటు..
కరెంట్‌ వినియోగం తక్కువగా ఉండాలి. ఎక్కువ చల్లదనం అందించాలనుకునే వారు నగరంలో ఎక్కువే. దీంతో 5 స్టార్‌ ఇన్వర్టర్‌ ఏసీలకు నగరంలో డిమాండ్‌ అధికంగా ఉంది. సంవత్సరానికి 750 యూనిట్ల విద్యుత్‌ దాటకూడదని కోరుకుంటున్న నగరవాసులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. దాదాపు 50 శాతం మంది కాస్త ఉక్కపోత వస్తే చాలు ఏసీ ఆన్‌ చేస్తున్నారని లెక్క తేలింది. 15 శాతం మంది రోజుకు 4–6 గంటలు వినియోగిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు