మండే ఎండలు మొదలు!

2 Mar, 2018 02:58 IST|Sakshi

పలు చోట్ల 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఇక ఎండలు జోరందుకుంటాయి: వాతావరణ శాఖ

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చి ప్రారంభం కావడంతో రానురాను ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్‌ నుంచి వడగాడ్పులు మొదలవుతాయని.. ఈ సారి వడగాల్పులు ఎక్కువ రోజులు నమోదవుతాయని స్పష్టం చేసింది. దీంతో వేసవి ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. గత 24 గంటల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల వరకు అధికంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

భద్రాచలంలోనూ 2 డిగ్రీలు అధికంగా 38 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, హన్మకొండల్లోనూ 3 డిగ్రీలు అధికంగా 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు అక్కడక్కడ సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలో 23, నిజామాబాద్, భద్రాచలంలలో 21 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. హన్మకొండలో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

మరిన్ని వార్తలు