ఆదివారం సేవలకు అనూహ్య స్పందన

26 Aug, 2019 10:36 IST|Sakshi
ఫీవర్‌ ఆస్పత్రిలో ఓపీ క్యూలైన్‌

ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ఆదివారం ఓపీ సేవలు  

ఫీవర్‌లో అదనంగా 10 మంది వైద్యుల కేటాయింపు

నల్లకుంట: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా నగరంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు సోకుతున్నండటంతో నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో రోగులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆదివారం కూడా ఓపీ సేవలను కొనసాగించాలని ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంత కుమారి ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ మేరకు నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి 10 మంది వైద్యులను, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు ఐదుగురు చొప్పున వైద్యులను అదనంగా కేటాయించారు. రోగుల రద్దీ తగ్గే వరకు వీరు విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీజన్‌ పూర్తయ్యే వరకు మిగతా రోజుల్లో మాదిరిగానే ఆదివారం కూడా  ఓపీ సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. దీంతో ఆదివారం నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో ఓపీ సేవలు అందించారు. ఓపీలో 600 మందికి పైగా రోగులు చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ మాట్లాడుతూ..  వాతావరణ మార్పులతో ఫీవర్‌ ఆసుపత్రికి జ్వర బాధితులు అధికంగా  వస్తున్నారన్నారు. పెరిగిన రద్ధీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీవర్‌ ఆసుపత్రికి అధనంగా 10 మంది వైద్యులను నియమించిందన్నారు. రోగులు భయపడాల్సిన పని లేదని, అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఉస్మానియా ఆసుపత్రిలో..
అఫ్జల్‌గంజ్‌: ఉస్మానియా ఆసుపత్రిలో జ్వర బాధితుల కోసం ఆదివారం అందుబాటులో ఉంచిన ఓపీ సేవలకు అనూహ్య స్పందన లభించిందని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌ అన్నారు. ఆదివారం  ఔట్‌ పేషెంట్లుగా 70 మంది రోగులు నమోదు కాగా సుమారు 50 మంది  ఇన్‌పేషెంట్లు ఉన్నట్లు తెలిపారు.  సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల ఆదేశాల మేరకు రోగుల సౌకర్యార్థం  ఆదివారం ఓపీ సేవలు కొనసాగిస్తున్నామన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా