వారికి రిలీఫ్‌లు లేవు: ఆర్టీసీ ఎండీ

22 Jan, 2020 01:45 IST|Sakshi

ఆర్టీసీ వెల్ఫేర్‌ బోర్డు సభ్యులకు రిలీఫ్‌పై సునీల్‌ శర్మ

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్లపాటు ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పటంతో కొత్తగా ఏర్పడ్డ డిపో సంక్షేమ మండళ్ల సభ్యులకు రిలీఫ్‌లు కేటాయించకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే అదనంగా సిబ్బంది సమస్యల పరి ష్కారం కోసం దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేశారు. ఈ సంక్షేమ మండళ్లు అందుబాటులోకి వచ్చి నెలరోజులు గడిచినందున, వాటి నిర్వహణలో ఉన్న ఇబ్బందులు తెలుసుకుని, తగు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా మరింత పకడ్బందీగా వ్యవహరించేందుకు సాధారణ శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది.

బస్‌భవన్‌లో మంగళవారం జరిగిన కరీంనగర్‌ జోన్‌ పరిధిలోని డిపో మేనేజర్లు, అకౌంట్స్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని సునీల్‌ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొందరు డిపో మేనేజర్లు, సంక్షేమ మండళ్ల సభ్యులు తమకు విధులు లేకుండా రిలీఫ్‌లు కేటాయించాలని కోరుతున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మందిని మించి సభ్యులున్నం దున, వారికి రిలీఫ్‌లు ఇస్తే సంస్థపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. రోజు కాసేపు మాత్రమే సిబ్బంది సమస్యలపై దృష్టి సారిస్తే సరిపోతుందని, ఇందుకు పెద్దగా సమయం పట్టనందున ప్రత్యేకంగా రిలీఫ్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు