సూపర్‌ఫాస్ట్‌ రిజిస్ట్రేషన్‌

3 Dec, 2017 02:15 IST|Sakshi

కొత్త సర్వర్లు, స్టోరేజీ ఏర్పాటుతో మరింత వేగంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు

ఒక్కో లావాదేవీకి కనీసం పావుగంట తగ్గే అవకాశం

గత మూడురోజుల అంతరాయానికి సోమవారంతో తెర

ఈ నెలలోనే అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు కొత్త నెట్‌వర్క్‌

సాక్షి, హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త హంగులు సమకూర్చుకుంటోంది. ఎప్పుడూ సర్వర్ల మొరాయింపు సమస్యతో రిజిస్ట్రేషన్‌ లావాదేవీల్లో కలిగే అంతరాయాన్ని పూర్తిగా నివారించడంతో పాటు అత్యంత వేగంగా కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా అదనపు సాంకేతిక సామగ్రిని ఏర్పాటు చేసుకుంటోంది.తద్వారా ఒక్కో రిజిస్ట్రేషన్‌ లావాదేవీకి కనీసం పావుగంట మేర సమయం కూడా ఆదా అవుతుందని అంచనా వేస్తోంది.

దాదాపు 7వేల టెరాబైట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకుంటున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ సర్వర్లతో ఉన్న లింకును కూడా తొలగించుకుని పూర్తిగా స్వతంత్రం కానుంది. ఇక శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సేవలు సోమవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి.

గచ్చిబౌలిలో సెంట్రల్‌ సర్వర్‌
రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతోనే రిజిస్ట్రేషన్ల శాఖ తన లావాదేవీలను మరింత వేగవంతం చేసుకుంటోంది. ఐటీ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని స్టేట్‌ డాటా సెంటర్‌లో 7వేల టెరాబైట్ల సామర్థ్యం గల సెంట్రల్‌ సర్వర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వర్‌తో పాటు స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా నాలుగింతలు పెంచేశారు. దీంతో గతంలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల అప్‌లోడ్, డాటా ఎంట్రీ, ఫొటో క్యాప్చర్‌ లాంటి ప్రక్రియల కోసం ఒక్కో లావాదేవీకి కనీసం గంట సమయం తీసుకునేది.

కానీ, ఇప్పుడు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ లావాదేవీలను  ముప్పావుగంటలో పూర్తి చేయగలమని ఆ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ‘గతంలో అనేక సమస్యలు వస్తుండేవి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సగంలో ఆగిపోయేది. ఒక గంట తర్వాత మళ్లీ వచ్చి ఓ పది నిమిషాల్లో కట్‌ అయ్యేది. దీంతో గంటలో పూర్తి కావాల్సిన ప్రక్రియకు 3,4 గంటలు పట్టేది. ఒక్కోసారి రోజుల తరబడి సర్వర్లు పనిచేసేవి కావు. ఇప్పుడు ఈ సమస్య ఉండదు’ అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం భవిష్యత్తు రిజిస్ట్రేషన్‌ లావాదేవీలపై భరోసా కలిగిస్తోంది.


వీడియోకు కొంత సమయం
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్‌ చేసి దానిని సీడీ రూపం లో కొనుగోలుదారుకు ఇచ్చే ప్రక్రియ ఆలస్యం కానుంది. డిసెంబర్‌1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, సర్వర్ల మార్పు ప్రక్రియలో అధికారులు బిజీగా ఉండటంతో ఆలస్యం కానుంది. ఈ నెలలోనే రికార్డింగ్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే నెలలో రెయిల్‌టెల్‌ ద్వారా సమకూరుస్తున్న మల్టీపర్పస్‌ లింకింగ్‌ నెట్‌వర్క్‌ కూడా రాష్ట్రంలోని 141 రిజిస్ట్రేషన్‌ కార్యాలయా ల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే 90 కార్యాలయాల్లో ఈ ఏర్పాటు పూర్తి కాగా, మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా పూర్తయితే సాంకేతికంగా తెలంగా ణ రిజిస్ట్రేషన్ల శాఖ బలోపేతం కానుంది.


సోమవారం నుంచి యథాతథం
‘సర్వర్లు, స్టోరేజీ మార్పులో భాగంగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ సర్వీసులు నిలిపివేశాం. శని, ఆదివారాలు ఎలాగూ సెలవే కనుక సోమవారం నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా యథా తథంగా ప్రారంభమవుతాయి.’ –రిజిస్ట్రేషన్ల శాఖ ఏఐజీ వేముల శ్రీనివాసులు

మరిన్ని వార్తలు