నాణ్యత అక్కర్లేదా..?

26 Nov, 2019 01:29 IST|Sakshi

అటకెక్కిన టీఎస్‌ ఫుడ్స్‌ ముడిసరుకుల నాణ్యత పరిశీలన 

విచారణ, థర్డ్‌ పార్టీ నివేదిక కోసం వేచిచూడని వైనం 

గడువు ముగుస్తుందన్న సాకుతో టెండర్లు తెరిచేందుకు సన్నద్ధం 

29న ఖరారు కానున్న కాంట్రాక్టర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఫుడ్స్‌కు ముడిసరుకుల సరఫరాలో నాణ్యత ప్రమాణాలు అటకెక్కాయి. నాసిరకం సరుకులను కాంట్రాక్టు సంస్థ సరఫరా చేస్తుందనే అభియోగాలను అధికారులు అట్టిపెట్టారు. వాటిపై నిజానిజాలు తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వేసిన థర్డ్‌ పార్టీ ఎంక్వైరీ విచారణ ప్రక్రియకే పరిమితమైంది. కాంట్రాక్టు సంస్థ కాలపరిమితి ముగుస్తుందన్న సాకుతో టీఎస్‌ ఫుడ్స్‌ అధికారులు థర్డ్‌ పార్టీ నివేదిక కోసం వేచి చూడకుండా.. నిజాలు తేలే వరకు టెండర్లు తెరవొద్దని మంత్రి తేల్చిచెప్పినా కూడా అధికారగణం మాత్రం టెండర్లు తెరిచేందుకే మొగ్గు చూపింది.

టీఎస్‌ ఫుడ్స్‌కు ముడిసరుకుల సరఫరాకు వచ్చిన టెండర్లను అధికారులు సోమవారం తెరిచారు. ఇందులో సాంకేతిక పరమైన అంశాలను మాత్రమే పరిశీలించినట్లు తెలిసింది. కాగా, ముడిసరుకుల కాంట్రాక్టు సంస్థను ఈనెల 29న ఖరారు చేస్తారు. సోమవారం సాంకేతిక అంశాలను పరిశీలించిన టీఎస్‌ ఫుడ్స్‌ అధికారులు 29న ఆర్థికపరమైన అంశాలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో తక్కువ ధరలు కోట్‌ చేసి ఎల్‌1ని గుర్తించిన సంస్థకు కాంట్రాక్టు బాధ్యతను అప్పగిస్తారు. తాజా టెండర్ల ప్రక్రియలో కొన్ని ప్రధాన సంస్థలే టెండర్లు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో పాల్గొన్న సంస్థలే ఈసారి కూడా టెండర్లు వేసినట్లు సమాచారం. గతంలో అనుసరించిన వ్యూహాల ప్రకారమే ఈసారి కూడా టెండర్ల ప్రక్రియ జరిగిందని, గతంలో సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కే టెండర్‌ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. 

అంతా సిండికేటుదే
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల లోపు చిన్నారులకు ఇస్తున్న బాలామృతం, న్యూట్రీమిక్స్, స్నాక్‌ ఫుడ్‌ వంటి ఆహార పదార్థాలన్నీ తెలంగాణ ఫుడ్స్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటి తయారీకి అవసరమై న ముడిసరుకును టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థ నుంచి తెలంగాణ ఫుడ్స్‌ కొనుగోలు చేస్తుంది. ముడిసరుకులను సరఫరా చేసే కాంట్రాక్టులో నాలుగైదు సంస్థలే కీలకంగా ఉంటున్నాయి. దాదాపు పన్నెండేళ్లుగా ఈ సంస్థలే టెండర్లు దక్కించుకుంటున్నాయి. ఈ సంస్థలే సిండికేట్‌గా మారి టెండర్లు వేస్తున్నాయని, అందుకే ఆ సిండికేటులోని సంస్థలే ఏటా కాంట్రాక్టు దక్కించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్‌ నాణ్యతపై ఫిర్యాదులు అందడం తో మంత్రితో పాటు అధికారులు సీరియస్‌ అయ్యారు.  

మరిన్ని వార్తలు