మత్స్యకారులకు అన్నివిధాలా చేయూత 

1 Feb, 2019 00:48 IST|Sakshi

ఆక్వా ఎక్స్‌పో–2019  ప్రారంభ సదస్సులో ఎమ్మెల్యే తలసాని  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మత్స్యకారులకు అన్ని విధాలా చేయూతనిచ్చి ఆదుకుంటామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సీఫా (సొసైటీ ఫర్‌ ఇండియన్‌ ఫిషరీస్, ఆక్వాకల్చర్‌), తెలంగాణ పశుసంవర్థక, మత్స్యశాఖ, ఆక్వా ఫామింగ్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సొల్యూషన్స్‌ (ఏఎఫ్‌టీఎస్‌), హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్లు సంయుక్తంగా నిర్వహించిన ఆక్వా ఎక్స్‌పో–2019 సదస్సును తలసాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత మత్స్యకారుల అభివృద్ధిని మాత్రమే చూసేవారని, తెలంగాణ మత్స్యశాఖ దరిదాపులకు కూడా ఎవరు రాలేదన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ చొరవ తో మత్స్య పరిశ్రమ మీద ఆధారపడిన ముదిరాజ్, గంగపుత్ర వాటి ఉపకులాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని తెలిపారు. దేశంలోనే మత్స్యకారులకు ఉచితంగా చేపల ఫీడ్‌ను అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రతీ చోట చేపల పెంపకానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర మత్స్యశాఖ అధికారుల కృషి, సీఎం కేసీఆర్‌ సంకల్పంతో మత్స్యశాఖ అభివృద్ధి దిశగా నడుస్తోందన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే నీటి లభ్యత పెరుగుతుందని, దానికి అనుగుణంగా చేపల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చేపల పెంపకంతో పాటు మార్కెటింగ్‌ పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మత్స్యకారులకు చేపల పెంపకానికి అధునాతన టెక్నాలజీతో కూడిన పరికరాలను అందజేశామన్నారు. 2018– ఆక్వా ఎక్స్‌పో విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో 2019–ఎక్స్‌పోను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ, రెండేళ్ల నుంచి ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందుకు రూ.వెయ్యి కోట్ల బడ్డెట్‌ను కేటాయించిందని పేర్కొన్నారు. సదస్సులో ఫిషరీస్‌ కమిషనర్‌ సువర్ణ, సీఫా అధ్యక్షుడు రామచందర్‌రాజు, పలు దేశాల ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల మత్స్యకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు