పత్తికి మద్దతు ధర పెరుగుతోంది

12 Nov, 2017 01:39 IST|Sakshi

ధాన్యం కొనుగోలుపై సెర్ప్‌ సమ్మె ప్రభావం లేదు: హరీశ్‌

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తికి క్రమంగా మద్దతు ధర పెరుగుతున్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ. 4,320కాగా ఆదిలాబాద్‌ వంటి చోట్ల రూ. 4,450 నుంచి రూ. 4,500 ధర లభిస్తున్నట్లు చెప్పారు. తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్నప్పటికీ పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ధర ఉందన్నారు. ఇప్పటికే భారతీయ పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా 3.50 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా ప్రైవేటు వ్యాపారులు 26.03 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారన్నారు.

చివరి గింజ వరకు కొంటాం...
వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనేలా ఏర్పాట్లు జరిగాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటివరకు 4.73 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించామని, ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 1,732 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. 96,348 మంది రైతుల నుంచి రూ. 752 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. కొన్నిచోట్ల సెర్ప్, ఐకేపీ సిబ్బంది సమ్మె చేస్తున్నందున ధాన్యం కొనుగోళ్లకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

ఎక్కడైనా సిబ్బంది కొరత ఏర్పడితే సహకార, పంచాయతీరాజ్‌ వంటి ప్రభుత్వశాఖల సహకారం తీసుకొని ధాన్యం సేకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు లేవని భూపాలపల్లి జయశంకర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. గ్రేడ్‌–1 బీపీటీ తదితర రకాల సన్న రకం బియ్యానికి మద్దతు ధర లభిస్తోందని, కేసముద్రం, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర మార్కెట్లలో రూ. 1,600 నుంచి రూ. 1,800కుపైగా రేటు వస్తోందని హరీశ్‌రావు తెలిపారు.

నిర్మల్‌ జిల్లాలో 44, నిజామాబాద్‌లో 214, కామారెడ్డిలో 186, మెదక్‌లో 178, సిద్దిపేటలో 104, కరీంనగర్‌లో 181, జగిత్యాలలో 248, సిరిసిల్లలో 145, పెద్దపల్లిలో 67, వరంగల్‌ రూరల్‌లో 84, వరంగల్‌ అర్బన్‌లో 41, జనగామలో 40, నల్లగొండలో 54, సూర్యాపేటలో 16, యాదాద్రిలో 106, మహబూబ్‌నగర్‌లో 7, వనపర్తిలో 3, మేడ్చెల్‌లో 5, శంషాబాద్‌ జిల్లాలో 7 కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తలు