టీచర్ల ఖాళీలను ఫిబ్రవరికల్లా భర్తీ చేయండి 

22 Jan, 2019 03:04 IST|Sakshi

తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం 

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకంపై గతంలో జేకే రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ మౌలిక వసతులు కల్పించాలని, టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు చేయలేదంటూ ఆర్‌.వెంకటేశ్‌ అనే టీఆర్‌టీ అభ్యర్థి కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను తాజాగా సోమవారం జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. టీచర్‌ పోస్టుల భర్తీలో తెలుగు రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని నివేదించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి 2017 మార్చిలోగా భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది జి.ప్రభాకర్‌ వాదిస్తూ.. ఏపీలో ఎస్జీటీ పోస్టులు 3,889, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1,625 సహా మొత్తం 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. జనవరి నెలాఖరుకు సంబంధిత పరీక్షలు పూర్తవుతాయని, ఫిబ్రవరి నెలాఖరుకల్లా భర్తీ పూర్తవుతుందని వెల్లడించారు. తెలంగాణలో సంబంధిత ఉద్యోగ పరీక్షలు పూర్తయినా కోర్టుల్లో కేసులుండటంతో ఫలితాలు వెల్లడించలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెంకటరెడ్డి నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఫిబ్రవరి ఆఖరులోగా నియామకాలు పూర్తిచేయాలని తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి మొదటి వారంలో చేపడతామని ఉత్తర్వులు జారీచేసింది.

మరిన్ని వార్తలు