మరో నలుగురిని నియమించండి 

16 Feb, 2019 02:35 IST|Sakshi

సమాచార కమిషనర్లపై తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం 

ఆరు నెలల్లోగా భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టీకరణ 

అధికారులనే కాకుండా వివిధ రంగాల ప్రముఖులను ఎంపిక చేయండి 

కమిషనర్లు లేకపోవడంతో పెండింగ్‌లో వేలాది అప్పీళ్లు

ప్రధాన కమిషనర్‌ నియామకంలో ఏపీది నిర్లక్ష్య ధోరణి అని వ్యాఖ్య 

సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు కమిషనర్లుగా ప్రస్తుత, పదవీ విరమణ పొందిన అధికారులనే కాకుండా న్యాయ రంగం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, జర్నలిజం, మాస్‌మీడియా రంగాల్లో లబ్ధప్రతిష్టులైన వారిని ఎంపిక చేయాలని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిం చింది. సమాచారహక్కు చట్టం–2005ని సమగ్రంగా అమలు చేసేలా ఆదేశాలు జారీచేయా లని కోరుతూ అంజలీ భరద్వాజ్, ఇతరులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సమాచార కమిషనర్ల నియామకాల్లో జాప్యం తోపాటు పారదర్శకత లేకపోవడం, దీంతో నియామకాలపై కోర్టుల్లో కేసులు నమోదు కావడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ, నాగాలాండ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాలు తక్షణం సమాచార కమిషనర్లను నియమించేలా ఆదేశాలు జారీచేయాల ని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం 52 పేజీల తీర్పును వెలువరించింది. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. పని భారాన్ని బట్టి కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్లలో గరి ష్ట సంఖ్యలో కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. కమిషనర్లను నియమించకపోవ డం వల్ల వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని, కొన్ని అప్పీళ్ల పరిష్కారానికి ఏళ్లు పడుతోందని అభిప్రాయపడింది. కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యే రెండు నెలల ముందే నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడేలా చూడాలని ఆదేశించింది.

తెలంగాణకు ఇలా... 
‘తెలంగాణలో సమాచార కమిషన్‌ వద్ద 10,102 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ సమర్పించింది. రాష్ట్ర విభజన అనంతరం సెప్టెంబర్‌ 2017లో తెలంగాణ సమాచార కమిషన్‌ ఏర్పడింది. అయితే ఒక ప్రధాన కమిషనర్, ఒక కమిషనర్‌ మాత్రమే నియమితులయ్యారు. ప్రస్తుతం భారీగా ఉన్న అప్పీళ్ల పరిష్కారానికి వీరు సరిపోరు. తగిన సంఖ్యలో కమిషనర్లను నియమించని పక్షంలో అప్పీళ్ల సంఖ్య మరింత పెరుగుతుంది. అందువల్ల తెలంగాణ సమాచార కమిషన్‌ పూర్తిస్థాయిలో పని చేసేందుకు కనీసం మరో నలుగురు సమాచార కమిషనర్లను నియమించాలి. ఈ సలహాను పరిగణనలోకి తీసుకుని సెలక్షన్‌ కమిటీ నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి. కొత్తగా సృష్టించే ఈ పోస్టులను ఈ తీర్పు వెలువడిన రోజు నుంచి ఆరు నెలల్లోగా భర్తీచేయాలి’అని సుప్రీంకోర్టు తెలంగాణకు సంబంధించిన తీర్పులో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌కు ఇలా... 
‘ఆంధ్రప్రదేశ్‌లో సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ను నియమించడంలో తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి అవలంభించారు. 2017 నుం చి ఏపీ సమాచార కమిషన్‌ పనిచేయలేదు. ఇటీవల ముగ్గురు కమిషనర్లను నియమించడంతో కమిషన్‌ కొంత క్రియాశీలకంగా వ్యవహరించగలుగుతుంది. కానీ కమిషన్‌ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఇది సరిపో దు. అందువల్ల ప్రధాన కమిషనర్, మిగిలిన కమిషనర్‌ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. ఈ తీర్పు వెలువడిన మూడు నెలల్లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ నియామకాలు పూర్తిచేయాలి’అని ఏపీకి సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు