సచివాలయ వివాదం : సర్కార్‌కు ఊరట

17 Jul, 2020 14:20 IST|Sakshi

జీవన్‌రెడ్డి పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పాత భవనాలు కూల్చివేసి దాని స్థానం కొత్తవాటిని నిర్మించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 136 ప్రకారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సచివాలయం వివాదంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే సమగ్రంగా పరిశీలిస్తోందని, ఈ సమయంలో తాము ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమంటూ న్యాయస్థానం తెలిపింది. (కూల్చివేతకు అనుమతి అవసరమా.. కాదా?)

ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషన్‌ ధర్మాసనం శుక్రవారం పిటిషన్‌ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి తాజా వివాదంపై కొంత  ఊరట లభించింది. కాగా ఇదే అంశంపై హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ‌(ఎన్‌జీటీ)లో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు