మర్రి శశిధర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 

29 Jan, 2019 02:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం తగదని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టులో గతేడాది ఆగస్టులో తొలుత పిటిషన్‌ దాఖలు చేయగా దాన్ని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ శశిధర్‌రెడ్డి తిరిగి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 11ను, ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని సవరించాల్సి ఉన్నా అవేవీ జరగకుండానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు జారీచేసిందని నివేదించారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. విచారణ అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో అభ్యర్థనలను మార్చజాలమని, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో సాంకేతిక కారణాల దృష్ట్యా తమ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. 

‘ఈడబ్ల్యూఎస్‌’ను సవాలు చేస్తూ ఆర్‌.కృష్ణయ్య పిటిషన్‌ 
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ‘అగ్రకులాల్లోని పేదలను అభివృద్ధి పరచాలంటే ఆర్థిక పరమైన స్కీములు, పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి పరచాలి. అంటరానితనం, సాంఘిక వివక్షకు గురవుతున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్యా, ఉద్యోగ, పాలన రంగంలో ప్రాతినిథ్యం లేని కులాలను గుర్తించి వారికి ప్రాతినిథ్యం కల్పించడం రిజర్వేషన్ల లక్ష్యం. ఉద్యోగాల్లో వారికి వారి జనాభా ప్రకారం ప్రాతినిథ్యం లేదని ఇస్తారా? వారు చదువుకోవడం లేదని ఇస్తారా? లేక సమాజంలో అగ్రకులాల వారికి సామాజిక గౌరవం లేదని ఇస్తారా? అనే కోణంలో చూడాలి. ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్టే ఇచ్చి విచారణ జరపాలి’అని పిటిషన్‌లో అభ్యర్థించారు.  

>
మరిన్ని వార్తలు