ఆరు వారాల్లో తేల్చండి

28 Aug, 2017 19:07 IST|Sakshi
ఆ ఎమ్మెల్యే పౌరసత్వంపై ఆరు వారాల్లో తేల్చండి

సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం అంశాన్ని ఆరు వారాల్లో తేల్చాలని కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో రమేశ్‌ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. రమేశ్‌ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ గతంలో శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రమేశ్‌ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో హైకోర్టు తీర్పునిచ్చింది.

సుప్రీం కోర్టులో రమేశ్‌ అప్పీలు చేయగా దీనిపై స్టే విధించింది. స్టేను తొలగించాలని ఆది శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గతేడాది ఆగస్టులో విచారించింది. 2008లో చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వం కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత పౌరసత్వం తిరిగి పొందగోరే వారు కనీసం ఏడాది కాలం దేశంలో ఉండాలి. అయితే చెన్నమనేని రమేశ్‌ ఏడాదిపాటు ఈ దేశంలో లేరని ఆది శ్రీనివాస్‌ ఫిర్యాదు చేయగా ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపి కేవలం 96 రోజులే దేశంలో ఉన్నట్టు తేల్చింది. ఈ నేపథ్యంలో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖ రమేశ్‌కు నోటీసులు జారీచేసింది.

అయితే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరపాలని చట్టం చెబుతోందని, అందువల్ల త్రిసభ్య కమిటీ వేయాలని చెన్నమనేని రమేశ్‌ హోం శాఖకు జవాబు పంపారు. కేంద్ర హోం శాఖ 2012లో త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరిపింది. కానీ నివేదిక ఇవ్వలేదు. ఆ నివేదిక హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని పిటిషనర్‌ ధర్మాసనానికి విన్నవించడంతో రమేశ్‌ పౌరసత్వ స్థితిపై మూడు నెలల్లో తేల్చాలని, సంబంధిత నివేదికను హైకోర్టుకు సమర్పించాలని 2016 ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాలు వెలువడిన కొద్దికాలానికి కేంద్ర హోం శాఖ మరికొంత గడువు కావాలని కోరింది. ఆ గడువు కూడా పూర్తికావడంతో తాజాగా సోమవారం మరోసారి ఆది శ్రీనివాస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించి కోర్టు ఆదేశాలు అమలు కాలేదని విన్నవించడంతో.. ఆరు వారాల్లో కేంద్ర హోం శాఖ ఈ అంశాన్ని తేల్చాలని ధర్మాసనం ఆదేశించింది.

మరిన్ని వార్తలు