వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా

30 Jan, 2020 02:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ న్యాయాలయాల చట్టం–2008ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గత అక్టోబరులో ఇచ్చిన నోటీసులకు స్పందించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం సంబంధిత పిటిషన్‌ విచారించింది. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సొసైటీస్‌ ఫర్‌ ఫాస్ట్‌ జస్టిస్‌ సంస్థ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు.

గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు సమర్పించాలని ధర్మాసనం గతంలో ఆదేశించినా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించలేదని, వాటికి జరిమానా విధించాలని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం తెలంగాణతో పాటుగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.లక్ష జరిమానా విధిస్తూ విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు