ఓటుకు కోట్లు కేసు విచారణ వాయిదా

30 Jan, 2019 03:20 IST|Sakshi

నాలుగు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసు విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు వాయిదావేసింది. శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా అప్పటి ఎమ్యెల్యే స్టీఫెన్‌సన్‌కు కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు తొలగించడాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 2016లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. అయితే ఏసీబీ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయసింహ గత విచారణ సందర్భంగా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ఇంప్లీడ్‌ పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరేన్‌ రావల్‌ ఆనాడు వాదించారు. దీనిపై ఉదయసింహ తరఫు న్యాయవాది సిద్ధార్థలూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు రాగా ఉదయసింహ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రాతన మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని సమాచారం పంపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా రెండు వారాలు తాను అందుబాటులో ఉండటం లేదని నివేదించగా ధర్మాసనం నాలుగు వారాలపాటు విచారణను వాయిదావేసింది.

నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు: మత్తయ్య
ఓటుకు కోట్లు కేసులో తనను ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. దీనిపై త్వరలో ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో తన వాదనలు తానే వినిపించుకునే అవ కాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో తనను నిందితుడిగా చేర్చగా హైకోర్టు చార్జ్‌షీట్‌ నుంచి తన పేరును తొలగించిందని, దీనిని ఏసీబీ సవాల్‌ చేసిందని వివరించారు. న్యాయస్థానం తన తరఫున వాదనలు వినిపించేందుకు వీలుగా అమికస్‌ క్యూరీని నియమించిందని, కానీ లోపలికి వెళ్లేందుకు తనకు పాస్‌ దొరకకుండా చేశారన్నారు.  

మరిన్ని వార్తలు