50 శాతం మించడానికి వీల్లేదు

8 Dec, 2018 01:19 IST|Sakshi

పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీలు, జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కేటాయింపు 50 శాతానికి మించరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, ఏఓఆర్‌ ఉదయకుమార్‌ సాగర్‌ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ఏర్పడ్డాక బీసీల జనాభా పెరిగినందున రిజర్వేషన్లు పెంచుకునేందుకు ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదించారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 7 శాతం కలిపి 61 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. అయితే గతంలో ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి రిజర్వేషన్లు 50 శాతమే కొనసాగుతున్నాయని, దీనికి లోబడే ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే హైకోర్టులో తుది విచారణ ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నివేదించగా ధర్మాసనం అందుకు సమ్మతించింది.
 

మరిన్ని వార్తలు