తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే 

16 May, 2020 06:49 IST|Sakshi

వైద్య విద్య పీజీ సీట్ల మార్పిడి వ్యవహారంలో ఉత్తర్వులు 

సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించి పీజీ డిప్లొమా సీట్లను సరెండర్‌ చేయడం ద్వారా పీజీ డిగ్రీ సీట్లకు అనుమతి పొందే ప్రక్రియను తెలంగాణ హైకోర్టు నిలిపివేయగా.. సుప్రీంకోర్టు ఆ నిర్ణయంపై స్టే ఇస్తూ ప్రతి వాదులకు నోటీసులు జారీచేసింది. పిటిషనర్లు కామినేని వైద్య కళాశాల, ఎం.ఎన్‌.ఆర్‌. వైద్య కళాశాల, ప్రతిమా వైద్య కళాశాలల తరపున సీనియ ర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్, న్యాయవాది అల్లంకి రమేశ్‌ వాదనలు వినిపించారు. జస్టిస్‌ మోహన్‌ ఎం.శంతనగౌడర్, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. జూలై 12, 2018న భారత వైద్య మండలి ఇచ్చిన అను మతి ఆధారంగా తెలంగాణలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 18 పీజీ డిప్లొమా సీట్లను సరెండర్‌ చేసి వాటికి బదులుగా పీజీ డిగ్రీ సీట్లకు అనుమతి తెచ్చుకున్నాయి.

అయితే ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన పీజీ డిప్లొమా ఆశావహ అభ్యర్థి ఒకరు గత నెల 22 న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఈ పీజీ డిప్లొమా సీట్ల మార్పిడిని సవాలు చేశారు. దీని వల్ల పీజీ డిప్లొమా సీటు పొందడంలో తన అవకాశాలు సన్నగిల్లాయని, నిమ్స్‌లోగానీ, బసవతారకం కాలేజీల్లో గానీ తన కు రేడియాలజీలో డిప్లొమా సీటు దక్కాల్సి ఉందని పిటిషన్‌ వేశారు. ఇం దులో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, నిమ్స్, బసవతారకం తదితర వైద్య కాలేజీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నే పథ్యంలో హైకోర్టు ఈ సీట్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే హైకోర్టు విచారించిన పిటిషన్‌లో తాము భాగస్వాములుగా లేమని, అప్పటికే సీట్ల మార్పిడి పూర్తయిందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. తదుపరి విచారణ జూన్‌ 1కి వాయిదాపడింది.  

మరిన్ని వార్తలు