ఖమ్మం.. విప్లవ గుమ్మం

9 Mar, 2015 07:52 IST|Sakshi
ఖమ్మం.. విప్లవ గుమ్మం

* ఖమ్మం కీర్తిని ప్రస్తావించిన వక్తలు
* తెలంగాణ సాయుధ పోరాటం మహత్తరం
* తరతరాల ఉత్తేజం ఈ ప్రాంతంలో ఉంది
* ఇక్కడ కమ్యూనిస్టులు బలమైన శక్తులు
* సీపీఐ రాష్ట్ర మహాసభల్లో పార్టీ
* జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.సుధాకర్‌రెడ్డి

 
 సాక్షి, ఖమ్మం: ‘ఖమ్మం విప్లవ స్ఫూర్తిని కలిగిస్తుంది.. విప్లవాల, పోరాటాల ఘన చరిత్ర ఈ నేలకు ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతం మహత్తర పోరాటం చేసింది’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శ్లాఘించారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. ఖమ్మం విప్లవ చరిత్ర తరతరాలకు ఉత్తేజం నింపుతుందన్నారు. బలమైన శక్తులుగా కమ్యూనిస్టులు జిల్లాలో ఉన్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ఈ మహాసభల స్ఫూర్తితో కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ తెలంగాణ
 రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యలయంలో నిర్వహించిన ప్రారంభ సభ అరుణశోభితమైంది. సీపీఐ నేతలతో పాటు, సీపీఎం, పార్వర్డ్‌బ్లాక్, సీపీఐ(ఎంఎల్), ఆర్‌ఎస్పీ, ఎంసీపీఐ, ఎస్‌వీసీఐ నేతలు ప్రారంభ సభలో ప్రసంగించారు. వామ పక్షాల ఐక్యతను చాటారు. వామ పక్షాలు ఐక్య ఉద్యమంతో కదం తొక్కుతూ, ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించాలని అన్ని పార్టీల నేతలు పిలుపునిచ్చారు. విద్యావేత చుక్కా రామయ్య ప్రసంగిస్తూ చాలాకాలం తర్వాత వామపక్షాలు ఐక్యవేదిక దిశగా కృషి చేస్తూ ఉద్యమిస్తుండటం శుభపరిణామమన్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఐక్యత రావాలని ఆయన ఆకాంక్షించారు.
 
 ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ప్రారంభ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు వామ పక్ష పార్టీల నేతలు ఐక్యతను చెబుతూ భవిష్యత్ ఉద్యమాలకు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రారంభ సభలో ప్రజానాట్యమండలి కళాకారులు ..‘రెపరెపలాడే ఎర్రజెండా.. ఎర్రై జెండా’.. ‘లాల్‌సలాం.. లాల్‌సలాం.. అమరవీరులకు లాల్‌సలాం’ అంటూ పాటలు పాడి సభికుల్లో ఉత్తేజం నింపారు.
 
 అమరులను స్మరించుకుంటూ ప్రతినిధుల సభ..
 సీపీఐ తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభల ప్రతినిధుల సభ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులు, ఆ పార్టీ అమరులను స్మరించుకుంటూ ప్రారంభమైంది. బైపాస్‌రోడ్‌లోని పువ్వాడ ఉదయ్‌కుమార్ (రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్) ప్రాంగణంలో 10 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులతో సభ జరిగింది. ఈ సభ ప్రాంగణం అంతా అమరుల చిత్రమాలికతో ఏర్పాటు చేశారు. నాటి తెలంగాణ సాయుధ పోరు నుంచి నేటి త్యాగధనుల వరకు స్మరించుకుంటూ ఈ ప్రాంగణంలో వారి చిత్రాలను, వీరోచిత గాథలను ఆవిష్కరించారు. ప్రతినిధుల సభ ప్రారంభానికి ముందు సీపీఐ జెండాను పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపాన్ని పార్టీ మరో సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు , జ్యోతిని తెలంగాణ సాయుధ పోరాటయోధులు తోడేటి కొమరయ్య ప్రజ్వలన చేశారు.
 పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రజా సమస్యలపై అలుపెరగాని ఉద్యమాలు చేస్తామన్నారు. అమర వీరులను స్మరించుకుంటూ.. ‘రెడ్ సెల్యూట్.. రెడ్ సెల్యూట్.. అమరవీరులకు జోహారు’్ల అంటూ ప్రతినిధుల ప్రాంగణంలో నినాదాలు మిన్నంటాయి.
 
 ప్రారంభ సభకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, నేతలు కె.నారాయణ, అజీజ్‌పాష, కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్వర్డ్‌బ్లాక్ నేత సురేందర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) నేత మూర్తి, ఆర్‌ఎస్పీ నుంచి జానకీరామ్, ఎంసీపీఐ నుంచి మద్దికాయల అశోక్, సీపీఐ నేతలు గుండా మల్లేష్, పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీందర్‌కుమార్‌నాయక్ ప్రసంగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా