స్థానికులకు 85% రిజర్వేషన్లు

5 Sep, 2017 02:02 IST|Sakshi

ప్రభుత్వానికి నివేదించిన సురేశ్‌చందా కమిటీ
సాక్షి, హైదరాబాద్‌: జిల్లా స్థాయి పోస్టుల్లో ప్రస్తుతం స్థానికులకు 80 శాతం ఉన్న రిజర్వేషన్లను 85 శాతానికి పెంచాలని సురేశ్‌చందా కమిటీ సిఫారసు చేసింది. జోనల్‌ వ్యవస్థ రద్దు, కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా కమిటీ తన నివేదికను సమర్పించినట్లు సమాచారం. జోన్ల వ్యవస్థను రద్దు చేసి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోస్టులు మాత్రమే ఉంచేందుకు రాష్ట్ర కేబినెట్‌ తీర్మానం చేసిన నేపథ్యంలో కమిటీ కూడా అదే కోణంలో సిఫారసులు చేసినట్లు తెలిసింది.

అధికారికంగా ప్రభుత్వం ఈ నివేదికను వెల్లడించలేదు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 780 రకాల ఉద్యోగాలు జోనల్, మల్టీ జోనల్‌ పోస్టులుగా పరిగణనలో ఉన్నాయి. వీటిలో 600 పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా మార్చి, మిగిలిన 180 పోస్టులను జిల్లా కేటగిరీగా మార్చాలని సూచించింది. రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో స్థానికత, రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకుండా న్యాయ శాఖ సలహా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. పూర్తిస్థాయి అధ్యయనంతో పాటు మరో సమగ్రమైన నివేదిక తయారీకి ఏకసభ్య కమిషన్‌ వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వులతో ముడిపడి ఉన్న అంశం కావటంతో కేంద్రానికి డ్రాఫ్ట్‌ను పంపించే ముందే అప్రమత్తంగా వ్యవహరించాలని భావిస్తోంది. పూర్తి స్థాయి మార్గదర్శకాలు, కేంద్రానికి పంపించే నివేదికను తయారు చేసే బాధ్యతను సీఎస్‌ ఎస్పీ సింగ్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే సురేశ్‌చందా కమిటీ పలుమార్లు వివిధ శాఖాధిపతుల అభిప్రాయాలను సేకరించింది. అన్ని శాఖల బాధ్యులు, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది.

మరిన్ని వార్తలు