ఆపరేషన్‌ వాయిదా.. చిన్నారి మృతి

3 Apr, 2020 08:21 IST|Sakshi

అమీర్‌పేట: కరోనా మహమ్మారి బూచి చూపి చిన్నారికి చేయాల్సిన శస్త్ర చికిత్సను వైద్యులు వాయిదా వేశారు. పరిస్థితి విషమించిన ఆ బాలిక మృతి చెందిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... వనస్థలిపురంలోని నిరుపేద కుటుంబంలో సంతోషిని అనే బాలిక జన్మించింది. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు చేసి వెన్నెముకలో ట్యూమర్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పాపకు వెంటనే శస్త్ర చికిత్స చేసి ట్యూమర్‌ను తొలగించాలని, లేదంటే బాలిక బతకడం కష్టమని తేల్చి చెప్పారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఫిబ్రవరి 28న యూసుఫ్‌గూడలోని శిశువివాహర్‌లో అప్పగించారు.

శిశువిహార్‌ అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కరోనా కేసులు వచ్చాయని, ప్రస్తుత తరుణంలో శస్త్ర చికిత్స చేయలేదమని, అందులో 40 రోజులపాప కావడంతో శస్త్ర చికిత్స చేయడం కుదరదని, ఐదు నెలల తరువాత తీసుకురావాలని వైద్యులు సూచించారు. బుధవారం చిన్నారిని తిరిగి నీలోఫర్‌కు తరలించారు. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారు జామున ఆ బాలిక మృతి చెందింది. శిశువిహార్‌ సూపరింటెండెంట్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి సమాచారం అందించారు. అయితే పాప అనారోగ్యంతో మృతి చెందినందున పోస్టుమార్టం అవసరం లేదని తెలిపారు. దీనిపై శిశువిహార్‌ సిబ్బంది గొడవకు దిగడంతో విషయం వెలుగులోని వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు