వీణావాణీలకు ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స

13 May, 2015 04:40 IST|Sakshi
వీణావాణీలకు ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స

లండన్ వైద్యులతో చేయించేందుకు ఎయిమ్స్ సంసిద్ధత
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణీల శస్త్రచికిత్సకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ముందుకు వచ్చింది. లండన్ గ్రేట్ ఆర్మండ్‌స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులను దేశానికి రప్పించి శస్త్రచికిత్స చేయిస్తామని ఎయిమ్స్ స్పష్టం చేసింది. వీణా వాణీ ల శస్త్రచికిత్స విషయమై దేశంలో ఉన్న అవకాశాలపై సలహా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నెల క్రితం ఎయిమ్స్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ వద్దనే శస్త్రచికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు సమకూర్చి వీణావాణీలను విజయవంతంగా వేరు చేయడంలో కృషి చేస్తామని వెల్లడించింది. ఇది లా ఉండగా ఇక్కడకు వచ్చి శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు అంగీకరిస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. లండన్ వైద్యులు హైదరాబాద్ నిలోఫర్‌కు వచ్చి వీణా వాణీలను పరీక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేస్తామని లండన్ వైద్యులు వెల్లడించారు.
 
ఆరు విడతలుగా చేసే ఈ ఆపరేషన్‌కు ఏడాది సమయం పడుతుందని స్పష్టం చేశారు. అందుకు రూ. 10 కోట్లు ఖర్చు కాగలదని ప్రభుత్వానికి నివేదిక పంపారు కూడా. లండన్ వైద్యుల నివేదిక అనంతరం తెలంగాణ సర్కారు శస్త్రచికిత్స విషయమై ఎయిమ్స్ సలహా కోరుతూ లేఖ రాసింది. అయితే, ఎయిమ్స్‌లో శస్త్రచికిత్సకు అంగీకరించిన ఆ సంస్థ ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఖర్చుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్‌కు మరో లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు ముందుకు వస్తారా లేదా కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒప్పించేలా చేయాలని కూడా భావిస్తోంది.

మరిన్ని వార్తలు