-

చదువురాకున్నా ‘పాఠం’ నేర్పుతున్నారు!

3 Apr, 2020 02:33 IST|Sakshi
నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం బోర్గాం గ్రామంలో రేషన్‌ షాప్‌ వద్ద సామాజిక దూరం పాటిస్తూ లైన్లో నిల్చున్న జనం (ఫైల్‌)

లాక్‌డౌన్‌ పూర్తిగా పాటిస్తున్న నిరక్షరాస్యులు, రైతులు, వృద్ధులు

ఉల్లంఘనుల్లో 18 నుంచి 25 ఏళ్లలోపు వారే అధికం

పట్టణాల్లో 50 శాతం, గ్రామాల్లో 80 శాతం అమలు... లాక్‌డౌన్‌ అంటే తెలియదన్న వారు 6 శాతం

తెలంగాణ పోలీసుశాఖ ఆన్‌లైన్‌ సర్వేలో వెల్లడి 

నిరక్షరాస్యులు, వృద్ధులు.. ఈ దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తప్పకుండా ఓటేసే ఉత్తమపౌరులు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ కూడా వీరు స్ఫూర్తిని చాటుతూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ అమలుకు వీరే పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో వెల్లడైంది. లాక్‌డౌన్‌ నిబంధనలను చదువురానివారు, వృద్ధులు నూటికి నూరుశాతం పాటిస్తూ ఇంటికే పరిమితమవుతున్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనుల్లో అధికశాతం చదువుకున్న యువతే ఉన్నారు. ముఖ్యంగా 18 – 25 ఏళ్లలోపు వయస్కులే ఎక్కువగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. పనీపాటాలేకుండా రోడ్లపై తిరుగుతూ పోలీసులకు, సమాజానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు.

గ్రామస్తులే నయం..! 
లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటిస్తున్నవారిలో గ్రామస్తులే నయమని పోలీసుశాఖ వెల్లడించింది. చిన్న పట్టణాలు, టౌన్‌లలో దాదాపు 50 శాతం ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారు. గ్రామాలలో అత్యధికంగా 80 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. అందులోనూ ఇంటికొక్కరు చొప్పున, ముఖానికి మాస్కులతో భౌతికదూరం పాటిస్తూ బయటికొస్తున్నారు. గ్రామాల్లోని చదువుకోనివారు, వృద్ధులు, వ్యవసాయదారులు, రైతులు మాత్రం నూటికి నూరుశాతం లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తున్నారు.

లాక్‌డౌన్‌కు ఓకే.. 
ప్రజారోగ్య పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు దాదాపు అన్ని వర్గాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. మెజారిటీ శాతం ప్రజలు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా, ఇంకా ఎక్కువ రోజులు అమలు చేయాలని కోరుకుంటున్నారు. వీరంతా ఇంటికి ఒకరిని మాత్రమే, అదీ నిత్యావసరాల కొనుగోళ్లకు లేదా అత్యవసర పనులుంటేనే బయటకు పంపుతున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలను 80 శాతం యథాతథంగా పాటిస్తూ లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ అంటే ఐడియా లేదని చెప్పిన కొందరి తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది.

లాక్‌డౌన్‌ ఎన్నిరోజులుండాలి? 
15 రోజులు చాలు: 62%
3 నెలలకు పొడిగించాలి: 27% 
6 నెలలు అమలుచేయాలి: 5%
ఐడియా లేదని చెప్పినవారు: 6%

లాక్‌డౌన్‌ పాటిస్తున్న ప్రాంతాల శాతం
చిన్నపట్టణాలు: 50%
గ్రామాలు: 80%

మరిన్ని వార్తలు