19న ఇంటివద్దే ఉండండి

2 Aug, 2014 04:53 IST|Sakshi
19న ఇంటివద్దే ఉండండి

సర్వే ద్వారా జిల్లా ‘డాటా బేస్’ తయారు
ఈ వివరాల ప్రకారమే జిల్లాకు పథకాలు,బడ్జెట్ కేటాయింపు
ఆ రోజు ఏ ఇల్లూ డోర్ లాక్ చేయొద్దు
అందుబాటులో ఉన్నవారు సమగ్రమైన వివరాలివ్వాలి
►'సాక్షి’తో కలెక్టర్ చిరంజీవులు
 సాక్షిప్రతినిధి, నల్లగొండ :రాష్ర్ట ప్రభుత్వం చేపట్టనున్న ఒకరోజు సర్వేకు సబంధించి శుక్రవారం సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు పాల్గొన్నారు.  ఆ వివరాలు ఆయన  ‘సాక్షి’కి తెలియజేశారు. జిల్లాలోని 9.50 లక్షల కుటుంబాల పూర్తి వివరాలను సర్వే ద్వారా సేకరించనున్నామని, మొత్తంగా 35.50 లక్షల జనాభా కవర్ అవుతారని వివరించారు. దీనికి 25 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 38వేల మంది సిబ్బంది అవసరం అవుతున్నారని, వీరిని పర్యవేక్షించేందుకు సూపర్‌వైజర్లు, ఇతరత్రా అంతా కలిపి 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సర్వేలో పాల్గొంటారని తెలిపారు.

ఈ నెల 19న  జరిపే సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో  15 రోజుల్లో ‘డాటా ఎంట్రీ’ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ డాటా ఆధారంగానే జిల్లాలో అమలు చేయాల్సిన పథకాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఈ విధంగా చూస్తే సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉందని, జిల్లా ప్రజలంతా సర్వేలో పాల్గొని పూర్తి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ చిరంజీవులు జిల్లా ప్రజలకు పిలుపు ఇచ్చారు. సీఎంతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కొన్ని సూచనలు కూడా చేశారు. సర్వే ఫార్మాట్‌లో ఉన్న కొన్ని లోపాలను, ముఖ్యంగా బ్యాంకు అకౌట్‌నంబర్లు, భూముల వివరాలు వంటి వాటిని సరిచేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు