మరో సర్వేకు సన్నద్ధం! 

4 Apr, 2019 19:22 IST|Sakshi

రైతుల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు 

సాక్షి, దోమ: రైతుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారిని అభివృద్ధిపథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో సర్వేకు శ్రీకారం చుట్టబోతోంది.  దీనిద్వారా రైతులకు సంబంధించి పూర్తి సమాచారం పక్కాగా సేకరించనుంది. సర్వేలో పంటల సాగు, ఇతర వివరాలను పొందుపర్చనున్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం త్వరలో క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిపై సర్వే చేసేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఈ రైతు సర్వేలో పాలుపంచుకోనున్నారు. అతి త్వరలో సర్వే ప్రారంభం కానుంది. రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేసి పంటల దిగుబడులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే పంట కాలనీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా ప్రతి రైతు నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాల నుంచి అన్నదాతల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది.  


39 ఆంశాలపై ఆరా..   
రైతుల సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు 39కి పైగా అంశాలు రూపొందించి ఫార్మాట్‌ ప్రకారం పూర్తి వివరాలను సేకరిస్తారు. ఇందులో భాగంగా రైతు వివరాలు, వారికి ఎంత భూమి ఉంది.. ఏఏ పంటలు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వర్షాధారమా.. ఆయాకట్టు ఉందా.. లేదా బోరుబావుల కింద సాగు చేస్తున్నారా..? తదితర అంశాలను సేకరించనున్నారు. రైతు సాగుచేసిన పంటల దిగుబడి ఎలా ఉంది.. ఆశించిన స్థాయిలో వస్తుందా లేదా అనే సమాచారం సేకరించి ఫార్మాట్‌లో పొందుపరుచనున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోందా.. మార్కెటింగ్‌ సౌకర్యం ఉందా.. ఆయా పంటలను పండిస్తే ఎంతమేర గిట్టుబాటు అవుతోంది.. అనే వివరాలను అధికారులు సేకరించనున్నారు. భూసారం ఎలా ఉంది.. ఏఏ ఎరువులను ఏఏ పంటలకు ఉపయోగిస్తున్నారనే వివరాలను పొందుపర్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

 
పంట కాలనీల ఏర్పాటు 
రైతులు పండించిన పంటలను స్థానికంగా విక్రయించి మంచి లాభాలను పొందడమే పంట కాలనీల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. సర్వే అనంతరం ఏఏ పంటల సాగు ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది.. ఏఏ సీజన్‌లో పంటలకు మంచి డిమాండ్‌ ఉంటుందనే అనే విషయాలను సేకరించనున్నారు. నీటి లభ్యతను పరిగణలోకి తీసుకొని వర్షాధామైతే మొట్ట పంటలు, బోరుబావులు,  కాల్వల ద్వారా అయితే ఇతర కూరగాయ పంటలను సాగు చేస్తున్నారనే అంశాలు తీసుకుంటారు.

మండలం, గ్రామం లేదా నియోజవర్గం యూనిట్‌గా తీసుకుని ఆయా ప్రాంతాల వారీగా సీజన్‌ను బట్టి ఏ పంటలను సాగు చేస్తారని సమాచారాన్ని అధికారులు పూర్తిస్థాయిలో సేకరించనున్నారు. ఆయా ప్రాంత రైతులందరూ డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇలా రైతులందరు కలిసి ఒకే పంటను సాగు చేసే విధానాన్ని పంట కాలనీ అని వ్యవహరిస్తారు. తద్వారా రైతులకు ఆయా పంటలకు మార్కెట్‌ సౌకర్యం లభించడంతో గిట్టుబాటు ధర లభించనుంది.   


గిట్టుబాటు ధరలే లక్ష్యం  
పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ చేసి సమభావన సంఘాల ద్వారా ప్రజలకు విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీనిద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధరను కల్పించడం పంట కాలనీల ఉద్దేశం. వ్యవసాయ ఉద్యానవన, మార్కెటింగ్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పరిశ్రమ శాఖల సమన్వయంతో పంట కాలనీల ద్వారా రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్‌ చేసి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు. 

ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం
రైతులకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులు చెప్పారు. పూర్తిస్థాయిలో ఇంకా ఆదేశాలు రాలేవు. 39 ప్రశ్నల కాలం గల ఫారం ఉండనుంది. ఫారాలు ఇంకా రాలేదు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో రైతుల సమగ్ర సర్వే నిర్వహిస్తాం.  
– శ్వేత, వ్యవసాయాధికారి, దోమ 

మరిన్ని వార్తలు