ఆన్‌లైన్‌ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి

21 Jun, 2020 04:55 IST|Sakshi

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆన్‌లైన్‌ అవగాహనపై సర్వే

15 లక్షలకిపైగా విద్యార్థుల కోసం మహిళా భద్రతా విభాగం వినూత్న ప్రయోగం

సర్వేపై ప్రచారానికి విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సాయం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా అందరి జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా టీనేజీ, యువతలో మానసికంగా మునుపెన్నడూ చూడనంత మార్పు వచ్చింది. కరోనా పుణ్యమాని విద్యాసంస్థలేవీ ఇపుడు మునుపటిలా పనిచేసే అవకాశాల్లేవు. దీంతో వారంతా ఇంటికే పరిమితమవుతున్నారు. ఇకపై పాఠాలు, తరగతులన్నీ ఆన్‌లైన్‌లోనే. అయితే, చాలామంది టీనేజీ పిల్లలకు, యువ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉన్న ఆపదలు, మోసాలు, అపాయాలపై అవగాహన లేదు. అలాగే, విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఎలాంటి ఆపదలు ఉంటాయన్న విషయంపై వారికీ తగినంత పరిజ్ఞానం లేదు. దీంతో విద్యార్థులు– తల్లిదండ్రుల మధ్య కొంత దూరం తలెత్తుతోంది. అందుకే, ఈ దూరాన్ని తగ్గించి విద్యార్థులు– తల్లిదండ్రులకు సురక్షిత ఆన్‌లైన్‌ సేవల వినియోగమే లక్ష్యంగా మహిళా భద్రతా విభాగం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమ ప్రచారం పోస్టర్లను మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) స్వాతి లక్రా, డీఐజీ సుమతి ఆవిష్కరించారు.

ఆన్‌లైన్‌ సర్వేకు శ్రీకారం! 
విద్యార్థులు తల్లిదండ్రులకు ఆన్‌లైన్‌ ఆపదలపై ఎంత పరిజ్ఞానం ఉందన్న అంశంపై ఆన్‌లైన్‌లోనే ఓ సర్వే చేపట్టింది. ఇందులో టీనేజీ, తల్లిదండ్రులకు వేర్వేరుగా ప్రశ్నావళి రూపొందించింది. ఉదాహరణకు మీకు రాన్సమ్‌ వేర్‌ అంటే తెలుసా? మీ మెయిల్స్, సోషల్‌ మీడియా ఖాతాలు హాక్‌ అయితే ఏం చేస్తారు? సైబర్‌ వేధింపులకు దిగితే ఎలా స్పందిస్తారు? తదితరాలు విద్యార్థులకు ఇచ్చారు. ఇక మీ పిల్లలు ఆన్‌లైన్లో ఏం చేస్తున్నారు? ఏయే కంటెంట్‌ చూస్తున్నారు? ఏం గేములు ఆడుతున్నారు? వేటి వల్ల ఎంత ముప్పు? వాటిని అధిగమించేందుకు వారిచ్చే సలహాలు తీసుకుంటున్నారు. ప్రశ్నావళిలో సమాధానాలు ఇవ్వలేకపోయిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి వాటిపై భవిష్యత్తులో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ ఆపైన 15 లక్షలకుపైగా విద్యార్థినులు ఉంటారు. ఈ సర్వే ప్రారంభించిన 24 గంటల్లోనే సుమారు 3000 మంది పాల్గొనడం విశేషం. ప్రతీరోజూ దాదాపు ఐదువేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సర్వేలో భాగస్వామ్యం అయ్యేలా ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని సంకల్పించారు.

రంగంలోకి విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ 
ఆన్‌లైన్‌ సర్వే కార్యక్రమం ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులను కలుపుకుంటే దాదాపు 30 లక్షలమందిని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. వీరందరూ తమ అభిప్రాయాలను తెలిపితే రాష్ట్రంలోని విద్యార్థులు– తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒక స్పష్టత వస్తుంది. అందుకే, ఈ కార్యక్రమంలో విద్యా, స్త్రీ శిశు సంక్షేమశాఖల సాయం కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లా విద్యాధికారులు (డీఈఓ)లకు ఈ సర్వే లింక్‌ చేరింది. వారి ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు చేరనుంది. అలాగే త్వరలోనే ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, వర్సిటీలూ  ఈ ఆన్‌లైన్‌ అవగాహన సర్వేలో పాల్గొనేలా చర్యలు చేపట్టనున్నారు.

పోస్టర్లను విడుదల చేస్తున్న ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి

మరిన్ని వార్తలు