సర్వేకు సన్నద్ధం

18 Aug, 2014 00:33 IST|Sakshi
సర్వేకు సన్నద్ధం

సాక్షి, సిటీబ్యూరో:సమగ్ర కుటుంబ సర్వేకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. ఆదివారం నిర్వహించిన ప్రీ సర్వేలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దుకుని సమర్ధవంతంగా సర్వే చేపడతామని కమిషనర్ సోమేష్‌కుమార్ చెప్పారు. ప్రీ సర్వేలో పదిళ్లు ఉన్న చోట వంద ఇళ్లు ఉండడంతో కరపత్రాలు సరిపోలేదు. ఇంటింటి స్టిక్కర్లు సైతం కొరత ఏర్పడింది. అలాగే సిబ్బంది కూడా సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఇళ్లు ఎక్కువ ఉన్న చోట అదనంగా సిబ్బందిని నియమించనున్నారు. కళాశాల విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లతో పాటు వివిధ రంగాల్లోని వారిని ఇందుకు వినియోగించుకుంటామని కమిషనర్ చెప్పారు. కోటి జనాభా దాటిన నగరంలో  ఇబ్బందులు సహజమేనని..వాటిని గుర్తించేందుకే ఏ జిల్లాలో లేని విధంగా నగరంలో రెండు రోజుల ప్రీ విజిట్‌లు నిర్వహిస్తున్నామన్నారు.

గుర్తించిన లోటుపాట్లను దాదాపుగా పరిష్కరించామన్నారు.  ఆదివారం దాదాపు 70 శాతం ప్రీ విజిట్ జరిగిందని, మంగళవారం మిగతా  30 శాతంతోపాటు.. రెండో విజిట్‌ను కూడా పూర్తిచేస్తామన్నారు. ఫిర్యాదులుంటే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు 040- 21 11 11 11 ఫోన్ చేయవచ్చునన్నారు.
 

మరిన్ని వార్తలు