రైతు కుటుంబాల ఆర్థికస్థితిపై సర్వే

25 Feb, 2019 04:18 IST|Sakshi

2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు నేపథ్యంలోనే..

ఈ నెల 21 నుంచే గ్రామాల్లో మొదలైన సర్వే ప్రక్రియ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేస్తోంది. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న దానికి అనుగుణంగా ఈ సర్వే చేస్తున్నట్లు అధికారు లు చెబుతున్నారు. ఈ ఐదేళ్లలో పరిస్థితులు ఏమైనా మారాయా.. మారితే ఏ మేరకు మార్పులు వచ్చా యి.. ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే కోణంలో ఈ సర్వే జరుగుతోంది. అర్థగణాంక శాఖ ద్వారా 1958 నుంచి సాంఘిక, ఆర్థిక సర్వేలను జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్‌ఎస్‌ఎస్‌వో)తో నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న దేశవ్యాప్తంగా ప్రారంభమైన సర్వే రాష్ట్రంలో ఈ నెల 21న ప్రారంభమైంది.

ఈ ఏడాది డిసెంబర్‌ వరకు విడతలవారీగా కొనసాగుతుంది. వాస్తవానికి 2022 లో సర్వే జరగాల్సి ఉండగా మూడేళ్ల ముందుగానే సర్వేకు కేంద్రం ఆదేశించింది. పదేళ్లకోసారి ఈ సర్వే జరగాల్సి ఉండగా దేశవ్యాప్తంగా 2020 నాటికి రైతు ల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రాల్లోని రైతుల ఆర్థిక స్థితిగతులపై కేంద్రం ముందస్తు గా అధ్యయనం చేస్తోంది. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా నమోదు చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పరిస్థితిని సర్వే చేయనుండగా, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధితో ఎలా జీవిస్తున్నారు.. రుణాల వినియోగం ఎలా ఉందనే కోణంలో వివరాలను ప్రత్యేక నమూనాలో పొందుపరచనున్నా రు. యాసంగి పంటలు చేతికొచ్చాక మళ్లీ రైతుల ఆదాయంపై సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది. 

కనీసమద్దతు ధర అందిందా? 
గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులకు ప్రాముఖ్యతనిస్తుండగా, పట్టణాల్లో అద్దెకుండే ప్రాంతాలను ఎం పిక చేశారు. గ్రామాల్లో రైతు కుటుంబాల ఆర్థిక స్థితి తెలుసుకుంటారు. ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారు? ఏఏ పంటలు వేస్తారు? విత్తనం నుంచి పం ట చేతికందే వరకు ఎంత పెట్టుబడి వచ్చింది? పంట విక్రయం తర్వాత వచ్చిన మొత్తం సొమ్మెంత? కనీసమద్దతు ధర అందిందా, లేదా? పెట్టుబడి, కుటుంబ ఖర్చులు పోను మిగిలిందెంత? వంటి వివరాలు నమోదు చేస్తారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో ఉన్నారా? ఆదాయమెంత? ఖర్చులెంత? వం టి వివరాలను పొందుపరుస్తారు. అప్పుల్లో ఉంటే అప్పుల వివరాలు, ఎందుకు అప్పులయ్యాయి, రుణాలివ్వడం లేదా.. ఇస్తే వినియోగమెలా ఉందనే వివరాలు సేకరించి వారి ఆర్థికస్తోమతను లెక్కిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు