ఐటీ బేజార్‌..!

28 Mar, 2018 02:45 IST|Sakshi

గ్రేటర్‌ హైదరాబాద్‌లో తగ్గుతున్న ఐటీ కొలువులు 

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ), బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌(బీపీవో), నాలెడ్జ్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌(కేపీవో) రంగాలకు కొంగుబంగారంగా నిలిచిన హైదరాబాద్‌ మహానగరంలో ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం వెనుకబడింది. తాజాగా ఐటీ రంగంలో వృద్ధిరేటు మైనస్‌ 6 శాతంగా నమోదైనట్లు నౌకరి డాట్‌కామ్‌ తాజా సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన ట్రెండ్‌పై జరిపిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను నౌకరీ డాట్‌కామ్‌ ఇటీవల వెల్లడించింది. 
  
గ్రేటర్‌లో తగ్గుతున్న ఐటీ కొలువులు.. 
బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు వెయ్యి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల బ్రాంచీలు గ్రేటర్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఏటా ఆశించిన మేరకు అమలు కాకపోవడం.. కొత్త ప్రాజెక్టులు చేజిక్కకపోవడం.. అంతర్జాతీయంగా మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో కొలువుల్లో మందగమనం నమోదైనట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో గ్రేటర్‌ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు నాలుగేళ్లుగా సాకారం కాకపోవడం.. దీనికి కేంద్రం తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం కూడా ఐటీ రంగం వృద్ధికి ప్రతిబంధకంగా మారిందని అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీ, టీఎస్‌ఐపాస్‌ రాకతో ఐటీ రంగంతోపాటు పారిశ్రామిక రంగాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయని, త్వరలోనే ఆయా రంగాల్లో క్రమంగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

గ్రేటర్‌లో ఇతర రంగాల దూకుడు.. 
గ్రేటర్‌ పరిధిలో ఐటీ రంగంతో పోలిస్తే ఇన్సూరెన్స్‌ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. బీమా రంగంలో 73 శాతం వృద్ధి నమోదవడం విశేషం. దేశ, విదేశాలకు చెందిన ఇన్సూరెన్స్‌ సంస్థలు నగరంలో వాహన, వ్యక్తిగత, ఆరోగ్య బీమా రంగంలో విభిన్న పాలసీలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పాలసీలను వినియోగదారుల వద్దకు చేర్చేందుకు పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టినట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆటోమొబైల్‌ రంగంలో 44 శాతం, నిర్మాణ రంగంలో 41 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో 40 శాతం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో 34 శాతం, ఫార్మా రంగంలో 14 శాతం, బీపీవో రంగంలో 9 శాతం వృద్ధి నమోదైనట్లు నౌకరీ డాట్‌కామ్‌ సర్వేలో తేలింది. 

మెట్రో నగరాల్లో ఉద్యోగాల కల్పనలో వృద్ధి శాతం ఇలా..

నగరం            ర్యాంకు      వృద్ధి శాతం
కోల్‌కతా           1                  34 
ఢిల్లీ                  2                  20 
ముంబై             3                 18 
హైదరాబాద్‌        4                 06 
బెంగళూరు         5                05 
చెన్నై                 5                05 
పుణే                 6                01


సేవా, పారిశ్రామిక రంగాల్లో గణనీయ వృద్ధి
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో మెరుగైన స్థానం సాధించడంతో హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకు బీమా కంపెనీలతో పాటు తయారీ రంగ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. టీఎస్‌ఐపాస్, ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయా రంగాల్లో వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోంది. 
    – శ్రీనివాస్, ఫ్యాప్సీ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు