నీటి వనరులపై సర్వే

14 Jun, 2019 12:10 IST|Sakshi
అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జల వనరుల లెక్క తేల్చేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చిన్న తరహా సాగునీటి వనరుల సర్వే చేపట్టేందుకు కసరత్తు మొదలు పెట్టింది. బోర్లు, బావులు, ఉపరితల నీటి నిల్వలకు ఆధారమైన కొలనులు, కుంటలు, చెరువులు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు, ఊట కుంటల సంఖ్యను లెక్కిస్తారు. రెండు వేల హెక్టార్లలోపు భూములకు సాగు నీరందించే వనరుల సమగ్ర సమచారాన్ని ఈ సర్వే ద్వారా సేకరిస్తారు. సదరు నీటి వనరు ఎప్పుడు ఏర్పాటైంది.. ఆ కాలంలో చేసిన ఖర్చు, నీటి సామర్థ్యం, దాని కింద ఖరీఫ్, రబీ సీజన్లలో సాగవుతున్న భూ విస్తీర్ణం, పండుతున్న పంటలు, ప్రస్తుత నీటి నిల్వలు, వినియోగంలో లేకుంటే అందుకు గల కారణాలు.. ఇలా సంపూర్ణ వివరాలు రాబడుతారు. ఈ సర్వే వారం రోజుల్లో మొదలు కానుంది. ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. 

సర్వే ఉద్దేశం ఇదీ.. 
ప్రతి ఐదేళ్లకోసారి చిన్నతరహా సాగునీటి వనరుల సర్వేను కేంద్ర జల వనరుల శాఖ చేపడుతోంది. 1986–87లో తొలిసారి శ్రీకారం చుట్టగా.. ప్రస్తుతం జరిగేది ఆరో సర్వే. 2017–18 సంవత్సరానికి సంబంధించిన ఈ సర్వే నిర్వహణకు ఆదేశాలు జారీకావడంతో దీనికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ప్రతి ఐదేళ్ల వ్యవధిలో నీటి వనరుల పరిస్థితి ఎలా ఉంది? నీటి వినియోగం తగ్గిందా.. పెరిగిందా? పంటల సాగు విస్తీర్ణం ఎలా ఉంది? ఆయా పంటలకు వినియోగమవుతున్న నీటి పరిమాణం, గతానికి..ప్రస్తుతానికి నీటి నిల్వలు పెరిగాయా..తగ్గాయా? తదితర వివరాలను విశ్లేషిస్తారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరగడం లేదు.

ఒక్కోసారి విస్తృతంగా వర్షాలు కురిసినా ఆశించిన స్థాయిలో నీటిని భూమిలోకి ఇంకించే ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు. మరోపక్క భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నీటి వనరుల గణన ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉంటే అందుకు గల కారణాలను కూలంకషంగా విశ్లేషించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారు. అంతేగాక భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక పథకాలను రూపొందించే అవకాశమూ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సర్వేలో గుర్తించిన ప్రతి నీటి వనరుని జియోట్యాగ్‌ చేస్తారు. భవిష్యత్‌ అవసరాల కోసంతోపాటు సర్వేలో పాదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు.

18లోపు అధికారులకు శిక్షణ 
గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రతి నీటి వనరుల లెక్క తేల్చేందుకు యంత్రాంగం ఉద్యోగులను రంగంలోకి దించుతోంది. పల్లెల్లో వీఆర్‌ఓలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్‌ ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. ఇక మున్సిపాలిటీల్లో బిల్‌ కలెక్టర్లు లేదా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు సర్వేలో పాల్గొంటారు. ఈ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు వీరిని సమన్వయం చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సర్వే ఎలా చేయాలన్న అంశంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ సమావేశం ఏర్పాటు చేశారు. సర్వేపై అవగాహన కల్పించారు. ఈనెల 18లోపు మండల, మున్సిపాలిటీల్లో కిందిస్థాయి ఉద్యోగులకు సర్వే నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లి గణన చేపడతారు. ఈనెల 30వ లోపు సర్వే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు