కేంద్ర పథకాలపై సర్వే..! 

8 Feb, 2019 11:14 IST|Sakshi

నల్లగొండ టూటౌన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మున్సిపల్‌ పట్టణాల్లో ‘సహరి సమృద్ధి యోజన’ సర్వే చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు సర్వే చేపట్టి పూర్తి నివేదిక తయారు చేయాలని మెప్మా అధికారులకు ఆదేశాలు అందాయి. కేంద్ర పథకాల సర్వేపై ఇప్పటికే రిసోర్స్‌ పర్సన్ల(ఆర్పీ)కు అవగాహన కల్పించారు. అన్ని పట్టణాల్లో కచ్చితమైన నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఇవి క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి ఏ విధంగా అందుతున్నాయనే సంక్షిప్త సమాచారం సేకరించే పనిలో మెప్మా సిబ్బంది పడ్డారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వాటిలో 23 పథకాల అమలుకు సంబంధించిన వివరాలను లబ్ధిదారుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. పొదుపు సంఘాల మహిళల్లో ఈ పథకాలు ఎంతమందికి అందుతున్నాయనే వివరాలను నివేదిక రూపంలో తయారు చేసి సీడీఎంఏ అధికారులకు పంపించాల్సి ఉంది.

ఎంత మందికి పథకాలు అందాయి ... 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో ఎంతమంది మరుగుదొడ్లు నిర్మించుకున్నారు, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఎంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు ... జన్‌ధన్‌ యోజనలో బ్యాంకు ఖాతాలు అందరూ తీసుకున్నారా ... ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి, సురక్ష  బీమా యోజనలో ఎంతమంది చేరారు ... ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎంత మందికి గ్యాస్‌ కనెక్షన్‌లు అందాయి ... అటల్‌ పెన్షన్‌ యోజన, జాతీయ నూట్రిషన్‌ మిషన్‌ తదితర పథకాలపై పొదుపు సంఘాల మహిళలనుంచి వివరాలు తీసుకుంటారు. ఎంతమంది ఈ పథకాలను వినియోగించుకుంటున్నారు, ఇంకా ఎంతమందికి ఈ పథకాలు చేరాలి, అర్హులైన వారుంటే ఈ పథకాలు ఎందుకు చేరడం లేదు, పొదుపు సంఘాల సభ్యులందరికీ ఈ పథకాలు చేర్చడమే లక్ష్యంగా ఈ సర్వే చేస్తున్నారు. 

లబ్ధిదారుల పేర్లు నమోదు ...
జిల్లాలోని పాత మున్సిపాలిటీలు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ తో పాటు కొత్త మున్సిపాలిటీలైన నందికొండ, హాలియా, చండూరు, చిట్యాలలో ఈ సర్వే చేపడుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మెప్మా ఆర్పీల ద్వారా కేంద్ర పథకాల లబ్ధిదారుల పేర్లను ఓ ఫార్మట్‌లో నమోదు చేస్తున్నారు. అన్ని వివరాలు సేకరించిన తరువాత పథకాలు అందని వారి వివరాలతో ప్రత్యేకం జాబితా తయారు చేస్తారు. కేంద్ర పథకాలలో ఎక్కువ శాతం పథకాలు బ్యాంకులతో సంబంధించినవి కావడంతో ఆయా మున్సిపాలిటీల కమిషనర్‌లకు ఈ జాబితాలు అందజేస్తారు. ప్రతి మున్సిపల్‌ కమిషనర్‌ బ్యాంకర్లతో సమావేశమై లబ్ధిదారులకు ముద్ర యోజన రుణాలు, జీరో బ్యాంకు ఖాతాలు, బీమా యోజన, పెన్షన్‌ తదితర వాటిని అమలు చేయించాల్సి ఉంటుంది. అదే విధంగా మున్సిపల్‌ పట్టణాల్లో మురుగుదొడ్లు లేని వారికి సత్వరమే స్వచ్ఛభారత్‌ కింద మంజూరు చేసి నిర్మాణం చేసేందుకు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. 

15 వరకు సర్వే 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై మున్సిపాలిటీ పట్టణాల్లో సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్‌లకు లేఖలు రాశాం. ఈనెల 15 వరకు ప్రొఫార్మాలో సూచించిన ప్రకారం వివరాలు సేకరించాలి. సర్వే పూర్తికాగానే పూర్తి నివేదికను సీడీఎంఏకు పంపిస్తాం.  – వెంకన్న, మెప్మా పీడీ, నల్లగొండ

>
మరిన్ని వార్తలు