వ్యాపార దిగ్గజం మీలా.. అస్తమయం 

26 Jun, 2019 02:29 IST|Sakshi

సూర్యాపేట: ప్రముఖ వ్యాపార దిగ్గజం, స్వాతంత్య్ర సమరయోధుడు, సుధాకర్‌ పీవీసీ గ్రూప్‌ కంపెనీ అధినేత, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మీలా సత్యనారాయణ (88) మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మీలా సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మీలా సతీమణి కమలమ్మ నాలుగేళ్ల క్రితమే కన్నుమూశారు. మీలాకు కుమారులు మహదేవ్, వాసుదేవ్, జయదేవ్, కుమార్తెలు విజయ, ఇందిర, రత్నకుమారిలు ఉన్నారు. మీలా అంత్యక్రియలు బుధవారం సూర్యాపేట మండలం గాంధీనగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

సుధాకర్‌ పీవీసీ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు.. 
1971లో ఉపాధ్యాయ వృత్తిని వీడిన మీలా సత్యనారాయణ సుధాకర్‌ పీవీసీ పైపుల కంపెనీని ప్రారంభించారు. సుధాకర్‌ పీవీసీ పైపుల కంపెనీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. దేశవ్యాప్తంగా పీవీసీ పైపుల కంపెనీలను స్థాపించారు. దీంతో సుధాకర్‌ అంటే మీలా.. మీలా అంటే సుధాకర్‌ అన్న రీతిలో పేరు ప్రఖ్యాతులు పొందారు.  

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్వాతంత్య్ర సమరయోధుడు మీలా సత్యనారాయణను ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక చేయగా, అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ఆయనకు అవార్డును అందజేశారు. పారిశ్రామిక రంగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అవార్డు ను అమెరికాలో భారత రాయబారి అబీద్‌ హుస్సేన్‌ చేతుల మీదుగా తీసుకున్నారు. సత్యనారాయణ మృతి పట్ల మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మల్లు స్వరాజ్యం సంతాపం ప్రకటించారు.  

సత్యనారాయణ గొప్ప నాయకుడు: దత్తాత్రేయ 
సాక్షి, హైదరాబాద్‌: సూర్యాపేట మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మీలా సత్యనారాయణ మరణంపై కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ నిరుపేదలకు నిస్వార్థ సేవలను అందించిన గొప్ప నాయకుడని, ఆయన మరణం ప్రజలకు తీరని లోటన్నారు. తాను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నపుడు ఆయన అనేక పథకాలను సూర్యాపేటకు మంజూరు చేయించారని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.  

మరిన్ని వార్తలు