మా భూములు మాకు ఇప్పించాలి

11 Feb, 2020 13:17 IST|Sakshi
రహదారిపై రాస్తారోకో చేస్తున్న బెట్టెతండా భూ బాధితులు

జాతీయ రహదారిపై బెట్టెతండా వాసుల రాస్తారోకో

17ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని ఆవేదన

పోలీసుల కాళ్లు పట్టుకుని న్యాయం చేయాలని వేడుకోలు స్తంభించిన ట్రాఫిక్‌

చివ్వెంల (సూర్యాపేట) : ఆక్రమించుకున్న మా భూములను ఇప్పించాలని కోరుతూ బాధితులు సూర్యాపేట పట్టణ పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ స్టేజీవద్ద హైదరాబాద్‌–విజయవాడ రహదారిపై రాస్తారోకో చేశారు. పాలకీడు మండలం బెట్టెతండాకు చెందిన ధీరావత్‌ నాగ, ధీరావత్‌ గమ్లీ, ధీరావత్‌ శోభన్‌బాబు, ధీరావత్‌ కిషన్, ధీరావత్‌ బాబులు.. గ్రామ శివారులోని సర్వేనంబర్‌ 59/అలొ 1.01 ఎకరాలు, 59/11/3/1లో 2.00 ఎకరాలు, 59/16లో 2.00 ఎకరాలలో ఉన్న భూములను 17 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్నారు. ఈక్రమంలో గత ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని.. ప్రస్తుతం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయ కూడా వస్తుందని బాధితులు పేర్కొన్నారు. కాగా గత నెల రోజులుగా గ్రామ మాజీ సర్పంచ్‌ ధీరావత్‌ రవినాయక్‌ తమను భయబ్రాంతులను గురిచేస్తూ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని, దీనిపై పాలకీడు తహసీల్దార్, ఎస్‌ఐలకు ఫిర్యాదు చేశామని.. అయినా ఫలితం లేకపోయిందని వాపోయారు. దీంతో సూర్యాపేట జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని అయినప్పటికీ న్యాయం జరుగలేదని ఆరోపించారు. దీంతో తమ కుటుంబ సభ్యులతో కలిసిన రాస్తారోకో దిగామని వారు పేర్కొన్నారు. వీరి రాస్తారోకోతో రహదారిపై వాహనాల రాకపోకులు స్తంభించి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో బాధితులు తమ గోడు వినిపించుకున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులు కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. పోలీసుల హామీతో చివరకు ఆందోళన విరమించారు.

తొమ్మిదిమందిపై కేసు
మా భూములు మాకే ఇవ్వాలని దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద హైదరాబాద్‌–విజయవాడ రహదారిపై ధర్నా చేసిన పాలకవీడు మండల వాసులు తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌డీ.ఇబ్రహీం తెలిపారు. వివరాల ప్రకారం పాలకవీడు మండల బెట్టెతండాకు చెందిన ధీరావత్‌ నాగు, ధీరావత్‌ బాబు, కిషన్, శోభన్‌బాబు, బంగారి, గమ్లీ, శారద, సుజాత, రంగమ్మలు తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో అరగంట  సేపు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు