నల్లగొండతో సుష్మాస్వరాజ్‌కు అనుబంధం

8 Aug, 2019 12:35 IST|Sakshi
నల్లగొండ సభలో మాట్లాడుతున్న సుష్మాస్వరాజ్‌ (ఫైల్‌)

2011లో తొలిసారి నల్లగొండకు వచ్చిన సుష్మా

ఎన్జీ కళాశాల మైదానంలో తెలంగాణ పోరుసభకు హాజరు

సుష్మాస్వరాజ్‌ మృతి దేశానికి తీరనిలోటు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి

సాక్షి, నల్లగొండ: గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందిన కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్‌ రాయకురాలు సుష్మాస్వరాజ్‌కు నల్లడొండతో విడదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 నవంబర్‌ 5న బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ పోరుసభ బహిరంగసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.  అప్పట్లో ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలి హోదాలో నల్లగొండకు తొలిసారి వచ్చారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సుష్మాస్వరాజ్‌ జాతీయ నాయకురాలు కావడడంతో ఆమెను కలుసుకోవడానికి జిల్లాకు చెందిన అనేకమంది ప్రముఖులు, మేధావులు, యవత పోటీ పడ్డారు. ఆ సమయంలో నల్లగొండలో బీజేపీ కార్యాలయ నిర్మాణం జరుగుతుండడంతో ఇక్కడికి వచ్చిన ఆమె నేరుగా స్థానిక బీజేపీ నేత బండారు ప్రసాద్‌ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యారు. 

అంధవిద్యార్థులతో ఆప్యాయంగా..


సుష్మాస్వరాజ్‌కు జ్ఞాపికను అందిస్తున్న డ్వాబ్‌ కార్యదర్శి చొక్కారావు (ఫైల్‌)

అనంతరం సుష్మాస్వరాజ్‌.. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో కలిసి నల్లగొండ పట్టణంలోని డ్వాబ్‌చే నిర్వహించబడుతున్న అంధుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చడించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ఆమెను డ్వాబ్‌ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు,  పాఠశాల సిబ్బందితో కలిసి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. 

సుష్మాస్వరాజ్‌ మృతి దేశానికి తీరనిలోటు
నల్లగొండ: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణం దేశానికి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోన ?బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే హరియాణలో శాసనసభకు ఎన్నికై 25వ ఏటనే రాష్ట్రమంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికై దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో అనుకూలంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్లో చిన్నమ్మగా అందరికి గుర్తుండి పోయారని తెలిపారు. సుష్మాస్వరాజ్‌ ఆకస్మిక మరణం అందరిని కలిచి వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా, పట్టణ నాయకులు  శ్రీరామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, ఓరుగంటి రాములు, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, భూపతిరాజు, యాదగిరాచారిచ దర్శనం వేణు, గుండగోని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


నివాళులు అర్పిస్తున్న బీజేపీ నాయకులు 

మరిన్ని వార్తలు