సభ ఎన్ని రోజులు?

30 Oct, 2017 01:35 IST|Sakshi

అసెంబ్లీ పనిదినాలపై ఇంకారాని స్పష్టత

చర్చించాల్సిన అంశాలపైనా తర్జనభర్జన!

50 రోజుల నిర్వహణకు సీఎం ప్రతిపాదన

అధికారులంతా అసెంబ్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణపై ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ శీతాకాల సమావేశాల పనిదినాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్ని రోజులు సభ జరుగుతుంది, ఏ రోజు ఏఏ అంశాలు చర్చకు పెడతారన్న విషయాలపైనా తర్జనభర్జన నడుస్తోంది. ఈనెల 26న జరిగిన శాసన సభ, శాసన మండలి బీఏసీ సమావేశాల్లో 50 రోజులు సభలు నిర్వహించేందుకు సిద్ధమని ప్రభుత్వం తరçఫున సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. కానీ ఎన్ని రోజులు జరుపుతారో ఖరారు చేయలేదు. తొలిరోజు సభ ముగిశాక డిప్యూటీ స్పీకర్‌తో ఫ్లోర్‌ లీడర్లు, శాసన వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు సమావేశమై చర్చకు తీసుకోవాల్సిన అంశాల ఖరారు, ఆయా పక్షాలకు ఇవ్వాల్సిన అవకాశాలపై చర్చించారు. ఈ భేటీలోనూ ఎన్ని రోజులైనా సభ జరుపుతామని ప్రకటించారే తప్ప కచ్చితమైన నిర్ణయం జరగలేదు. ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాత్రం సమావేశాలు 15 రోజులు జరిపితే చాలని భేటీలో ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. అయితే అధికార పక్షమే 50 రోజుల ప్రతిపాదనతో ముందుకు రావడంతో పనిదినాలపై అభిప్రాయం చెప్పకుండా ప్రతిపక్షాలు మిన్నకుండిపోయాయి. కాగా, ఇప్పటికే 10 రోజుల సభా కార్యక్రమాలకు సరిపడా రోజుకు 10 చొప్పున 100 ప్రశ్నలకు షెడ్యూలు సిద్ధం చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ వరకు సభా కార్యక్రమాల షెడ్యూలు ఖరారైందని సమాచారం. సోమవారం ప్రశ్నోత్తరాలతో పాటు హరితహారంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.  

50 రోజుల పనిదినాలు.. 10 వారాలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనుల పర్యవేక్షణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణపై అసెంబ్లీ పనిదినాల ప్రభావం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఏసీ సమావేశంలో ప్రతిపాదించిన మేరకు 50 రోజులు అసెంబ్లీ నడపాలంటే కనీసం 2 నెలల 10 రోజుల పాటు అసెంబ్లీ కార్యక్రమాలకే అధికారులు పరిమితం కావాల్సి ఉంటుందని అంటున్నారు. వారంలో 5 రోజులే సభ జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో 50 పనిదినాలు పూర్తవ్వాలంటే 10 వారాలు పడుతుందని చెబుతున్నారు. ఇన్ని రోజులు సభ జరిగితే వివిధ శాఖల అధికారులు అసెంబ్లీ చుట్టూ తిరగాల్సి ఉంటుందని, దీంతో ఆయా కార్యక్రమాలపై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఎన్ని రోజులు సభ జరుపుతారనే విషయంపై తర్జనభర్జన నడుస్తోంది.

25 అంశాలకైనా 3 వారాలే..
సభలో 19 అంశాలపై చర్చించాలని బీఏసీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ జాబితా అందజేసింది. ఇతర పక్షాలు కోరుతున్న అంశాలూ కొద్ది తేడాతో దాదాపుగా ఇవే ఉన్నాయని, ప్రభుత్వం మరికొన్ని అంశాలను జోడించినా మొత్తంగా 25 అంశాలు ఉంటాయంటున్నారు. వీటన్నింటనీ చర్చకు స్వీకరించినా 3 వారాల పనిదినాలు సరిపోతాయని, పనిదినాలపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంటున్నారు. కాగా, 50 రోజులకు సరిపడా చర్చించడానికి ప్రభుత్వం దగ్గర అంశాలు ఉన్నాయని అధికార పక్షం ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు