అవిశ్వాసం.. అయోమయం

8 Aug, 2014 03:13 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో గురువారం నిర్వహించాలని తలపెట్టిన ప్రత్యేక సమావేశం విషయంలో గందరగోళం నెలకొంది. చైర్మన్ దామోదర్‌రెడ్డిపై వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావించారు.

ఈ సమావేశానికి చైర్మన్ మద్దతు డెరైక్టర్లు గైర్హాజరు కాగా, వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి మద్దతు డెరైక్టర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు చేరుకున్న చంద్రశేఖర్‌రెడ్డి తన మద్దతు డెరైక్టర్లతో కలిసి డీసీసీబీ సమావేశం హాలులోకి వెళ్లారు. జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావుతో అరగంట పాటు చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి డీసీవోపై తీవ్ర ఆరోపణలు చేశారు. పక్షపాత ధోరణితో సహకార చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీసీవోను సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేశారు. ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించనున్నట్లు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. సమావేశానికి 11 మంది డెరైక్టర్లు హాజరైనప్పటికీ, కేవలం తొమ్మిది మంది మాత్రమే సంతకాలు చేసినట్లు డీసీవో పేర్కొన్నారు.

 నేటికి వాయిదా : డీసీవో
 అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నాముని డీసీవో ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక రోజు వాయిదా వేసేందుకు తమకు అధికారం ఉందని పేర్కొన్నారు. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కో-ఆప్షన్ డెరైక్టర్లకు ఓటు హక్కు అంశంపై న్యాయ సలహా కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై రాత్రి ఏడు గంటలకు మరో ప్రకటన విడుదల చేశారు. ‘గురువారం 11 గంటలకు డీసీసీబీ పాలకవర్గ ప్రత్యేక సమావేశం డీసీవో అధ్యక్షతన జరుపబడినది. ఈ సమావేశానికి తొమ్మిది మంది పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. చట్ట ప్రకారం 11 మంది సభ్యులు ఉంటేనే కోరం ఉన్నట్లు.. కానీ కోరం లేనందున సహకార చట్టం సెక్షన్ 34-ఎ (12) ప్రకారం ఈ సమావేశం జరుపబడలేదు’ అని ప్రకటనలో డీసీవో పేర్కొన్నారు. సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశామని మీడియాతో ప్రకటించిన డీసీవో.. సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో గందరగోళం నెలకొంది.

 అవిశ్వాసం వీగిపోయినట్లే.. : చైర్మన్ దామోదర్‌రెడ్డి
 తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లేనని చైర్మన్ దామోదర్‌రెడ్డి  పేర్కొన్నారు. అవిశ్వాస నోటీసు ఇచ్చిన డెరైక్టర్లు ఆ మేరకు బలం నిరూపిం చుకోవాల్సి ఉంటుందని, లేనిపక్షంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లేనని స్పష్టం చేస్తున్నారు. కారణం లేకుండా సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఒకవేళ రేపటికి వాయిదా వేసిన పక్షం లో ఈ మేరకు అధికారికంగా నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

 డీసీవోపై రాజకీయ ఒత్తిళ్లు?
 డీసీసీబీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జిల్లా సహకార అధికారిపై తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక వర్గం చైర్మన్ దామోదర్‌రెడ్డికి, మరోవర్గం ముఖ్య నాయకులు చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ఒత్తిళ్లకు గురి చేసినట్లు సమాచారం. దీంతో సహకార అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు