సూత్రధార్‌.. పాత్రధార్‌

19 Feb, 2020 08:22 IST|Sakshi

20 ఏళ్లుగా థియేటర్‌ ఆర్ట్స్‌లో రాణిస్తున్న ‘సూత్రధార్‌’ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ అధినేత వినయ్‌వర్మ

క్యారెక్టర్‌లో లీనమవ్వడం, ప్రేక్షకులను మెప్పించడమే టార్గెట్‌   

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సినిమాల్లోనూ హవా

20, 21 తేదీల్లో ‘అబ్బే..ఏమీ లేదు.! తెలుగు నాటక ప్రదర్శన

హిమాయత్‌నగర్‌:‘‘అలనాటి నటులు ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు తదితర మహా నటులు సైతం నాటకాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన వారే. నటన అనేది థియేటర్‌ ఆర్ట్స్‌తోనే వస్తుందంటున్నారు నటులు. థియేటర్‌ ఆర్ట్‌లోనే నటనకు ఓనమాలు దిద్దుకోవచ్చునంటున్నారు ‘సూత్రధార్‌’ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ అధినేత వినయ్‌వర్మ. కామెడీ, సీరియస్, విలనిజం, ఏడిపించడం, కవ్వించడం ఆయన సొంతం. థియేటర్‌ ఆర్ట్స్‌లో ఆయనకు తిరుగు లేదు. నటనలో లీనమవ్వడం, ఇతరులను మెప్పించడం ఆయనకే సాధ్యం. దేశవ్యాప్తంగా ఆయనకో క్రేజ్‌ ఉంది. నవలల్లోని స్టోరీలను ఆధారంగా చేసుకుని నేటివిటీ తగ్గట్టు నాటకాన్ని రూపుదిద్దుతారు. నాటకం పూర్తయ్యే వరకు కుర్చీలో  కూర్చోబెట్టగలిగే ప్రతిభ వినయ్‌వర్మ సొంతం.  

హిమాయత్‌నగర్‌కు చెందిన వినయ్‌వర్మ. 1980లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ‘సోషియాలజీ’ పీజీ పూర్తి చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో హుషారుగా ఉండేవారు. ఆయన ప్రతిభను గుర్తించిన రీసర్చ్‌ స్కాలర్‌ డాక్టర్‌ గోయల్‌ నాటకం చేస్తావా..అంటూ అడిగారు. 

రూ.లక్షలు వదిలి..లక్ష్యం దిశగా
ఆయన మాటను కాదనలేక నటించేందుకు ఒప్పుకున్న వినయ్‌వర్మ ‘యాంగ్రీయంగ్‌ మ్యాన్‌’గా చేశారు. ఒక లీడర్‌గా వ్యతిరేకంగా వెళ్లే క్యారెక్టర్‌లో లీనమైన వినయ్‌వర్మ యూనివర్సిటీలోని అందర్నీ తన నటనతో మెప్పించాడు. అందరూ ప్రశంసించడంతో నటనపై దృష్టి సారించాడు. ఇదే నటనతో యావత్‌ ప్రజానీకాన్ని మెప్పించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. చదువు పూర్తయ్యాక ‘డేనా’ బ్యాంకులో ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినా, తన లక్ష్యం కోసం రూ. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు.  

‘ సూత్రధార్‌’ ద్వారా 65కి పైగా నాటకాలు
హిమాయత్‌నగర్‌లో 1998లో ‘సూత్రదార్‌’ పేరుతో థియేటర్‌ ఆర్ట్‌ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా అనేక నవలల్లోని అతి ముఖ్యమైన కథలను నాటకాలుగా చిత్రీకరించారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కలకత్తా, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, భోపాల్, ఉదయ్‌పూర్‌ తదితర నగరాల్లోనూ నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 45 నిమిషాల నుంచి రెండు గంటల పాటు ఉండే ఈ నాటకాల్లో ‘నవ్వించడం, ఏడిపించడం, టెన్షన్‌కు గురి చేయడం, థ్రిల్‌ అయ్యేలా చెయ్యడం, మెప్పించడం, ఒప్పించడం’ ఆయనకు మాత్రమే సొంతం అనేలా అక్కున చేర్చుకున్నారు ప్రేక్షకులు.

‘లవ్‌’తో తెరంగేట్రం..
నాటకాల్లో అతడి నటనను చూసి మెచ్చిన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌ డైరెక్టర్లు తమ సినిమాల్లో అతడికి అవకాశాలు ఇచ్చారు. 2001లో ‘లవ్‌’ సినిమాతో తెరంగ్రేటం చేసిన వినయ్‌వర్మ ఆ సినిమాలో ‘టెర్రరిస్ట్‌’గా నటించాడు. ఆయన నటకు, తెరపైకి వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులను కుర్చీలలో నుంచి కదలనివ్వకుండా చేశాడు. ఇలా తెలుగులో 19 సినిమాలు, హిందీలో 7 సినిమాలు, హాలీవుడ్‌లో ‘బీపర్‌’ అనే సినిమాలో నటించాడు. బుల్లితెరపై కూడా తొమ్మిది సీరియల్స్‌ చేశాడు.  

అబ్బే..ఏం లేదు
ఇప్పటి వరకు ఆయన చేసిన నాటకాలన్నీ హిందీ, ఉర్దూ, మరాఠి, గుజరాతి తదితర భాషలకు చెందినవే. మొదటిసారి తెలుగు స్టోరీతో తెలుగులో ‘అబ్బే..ఏం లేదు’ అనే నాటకంతో ముందుకొస్తున్నాడు వినయ్‌వర్మ. ఓ కుటుంబంలో భార్య, భర్త, పనివాడు, డాక్టర్, ఇద్దరు దొంగలతో రూపుదిద్దుకున్న నాటకమే ‘అబ్బే..ఏం లేదు’. వినయ్‌వర్మ మొదటిసారి తెలుగులో చేస్తున్న నాటకం కావడంతో సిటీ ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో బంజారాహిల్స్‌లోని ‘లామాకాన్‌’ ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు.

‘థియేటర్‌ ఆర్ట్‌’ బేసిక్‌ నాలెడ్జ్‌
నాటకం అంటే ఈ రోజుల్లో వారికి పెద్దగా తెలీదు, దానిని లైట్‌గా తీసుకుంటారు. థియేటర్‌ ఆర్ట్‌ అనేది బేసిక్‌ నాలెడ్జ్‌. దాని నుంచి సినిమాల్లోకి వెళితే అవలీలగా చేయగలిగే శక్తి, సామర్థ్యాలు వస్తాయి. హీరో విజయ్‌ దేవరకొండ కూడా థియేటర్‌ ఆర్ట్‌ నుంచి సినిమాల్లోకి వెళ్లిన వ్యక్తే. విజయ్‌ నా శిష్యుడు అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. నటనపై ఆసక్తి, డెడికేషన్‌ ఉన్న వారికే నేను నేర్పిస్తా. మొదటిసారి తెలుగు నవలలోని ఓ కథను ‘అబ్బే..ఏం లేదు’ అనే పేరుతో ప్రదర్శిస్తున్నాము.  – వినయ్‌వర్మ, నటుడు, ‘సూత్రధార్‌’ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ అధినేత.

మరిన్ని వార్తలు