‘స్వచ్ఛ’ టీం రెడీ!

13 May, 2015 02:06 IST|Sakshi

- ముఖ్యులకు బాధ్యతల అప్పగింత
- ప్యాట్రన్లు, మెంటర్ల పేర్లు వెల్లడి

‘స్వచ్ఛ హైదరాబాద్’కు సన్నాహాలు ఊపందుకున్నాయి. విశ్వనగరమే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పరిశుభ్ర నగర బాధ్యతల్ని ముఖ్యులందరికీ అప్పజెబుతోంది. ముఖ్యమంత్రి నుంచి ఐఏఎస్ అధికారి వరకు పలువురు వీవీఐపీలు ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగం పంచుకుంటారు.  ఏరియాలు, బాధ్యతలు, ముఖ్యులెవరో ప్రభుత్వం ప్రకటించింది. 400పైగాయూనిట్లలో ఈ నెల 16 నుంచి ‘యజ్ఞం’ మొదలవనుంది.

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రప్రభుత్వం ఈ నెల 16 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ మహాయజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈమేరకు ఆయా విభాగాల బాధ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమం కోసం జీహెచ్‌ఎంసీని 400 యూనిట్లకు పైగా విభజించారు. ఒక్కో విభాగానికి ఒక్కొక్క వీవీఐపీ బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరిని పాట్రన్/మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు.

వీరి పర్యవేక్షణలో జీహెచ్‌ఎంసీకి చెందిన అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. నోడ ల్ అధికారి సమన్వయంతో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కేవలం పారిశుధ్య కార్యక్రమాలపైనే కాక ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలనూ వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారు. జీహెచ్‌ఎంసీలోని కొన్ని సర్కిళ్లకు ఒకరి కంటే ఎక్కువ మంది బాధ్యతలు నిర్వహించనున్నారు. కొన్ని సర్కిళ్లకు ఒక్కరే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా స్వచ్ఛ హైదరాబాద్‌పై చర్చించేందుకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు.

మరిన్ని వార్తలు