మరుగుదొడ్లతోనే ఆత్మగౌరవం

13 Feb, 2015 00:20 IST|Sakshi
మరుగుదొడ్లతోనే ఆత్మగౌరవం

నారాయణఖేడ్: మహిళలు తమ ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లను తప్పనిసరిగా నిర్మించుకోవాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌పై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్ హాల్‌లో గురువారం జరిగింది.  సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలో ఖేడ్ నియోజకవర్గం వెనుకంజలో ఉందన్నారు. 50వేల కుటుంబాలు ఉంటే కేవలం 12శాతం మందికి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయన్నారు.

గతంలో ఐహెచ్‌హెచ్‌ఎల్ పథకాన్ని చేపట్టినా కొన్ని లోటుపాట్ల వల్ల పూర్తి కాలేదన్నారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా రూ.12వేలను అందించనున్నట్టు తెలిపారు. మరుగుదొడ్డి మంజూరైన వారికి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల కోసం స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, తదితర నేతలు ముందుకు రావాలన్నారు.  గ్రామాల్లోని నాయకులు ప్రజలకు ప్రోత్సాహం కల్పించి సమష్టిగా నిర్మాణాలు చేపడితే నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌కు కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు ఇస్తోందన్నారు. వెనుకబడిన ఖేడ్ ప్రాంతాన్ని  ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు.  ఖేడ్ ప్రాంతంలో వలసల నివారణకు కృషి చేస్తానన్నారు.

ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ  ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఆర్థికంగా  నష్టపోతామన్నారు. అధికారుల సహకారంతో స్వచ్ఛ భారత్‌లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ సభావత్ రాములు నాయక్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌లో భాగంగా తాను  నియోజకవర్గంలోని 5గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. ఈసందర్భంగా నిర్మించిన నమూనా మరుగుదొడ్డిని పరిశీలించారు. సదస్సులో జంబికుంట సాయిలు కళాబృందం ద్వారా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఖేడ్ ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌ప్రకాష్, సబ్ డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, పీఆర్ ఈఈ వేణుమాధవ్, స్థానిక సర్పంచ్ అప్పారావు షెట్కార్, ఎంపీపీలు సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు