వందశాతం సాధించాలి

6 May, 2018 11:08 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

జహీరాబాద్‌ : మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు  ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక షెట్కార్‌ ఫంక్షన్‌ హాల్‌లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఇతర జిల్లాలతో పోల్చితే మన జిల్లా వెనుకబడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని లక్ష్యాలను సాధించేలా శ్రద్ధ చూపాలన్నారు.

ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకునేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని మహిళలు బహిర్భూమికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని చైతన్య పర్చి మరుగుదొడ్లను నిర్మించుకునేలా చూడాలని అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. మరుగుదొడ్లకు సంబంధించి నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఉన్నాయన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయించడంకోసం సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఇతర మండలాలతో పోల్చితే జహీరాబాద్‌ మండలం మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉందన్నారు.

వందశాతం మరుగుదొడ్లను సాధించి జిల్లాను అగ్రగామిగా నిలిపేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకుని లక్ష్యం పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు సినీ నిర్మాత ఎం.శివకుమార్‌ ముందుకు వచ్చి ఈదులపల్లి, మేదపల్లి గ్రామాలను దత్తత తీసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్దీన్, ఆర్డీఓ అబ్దుల్‌ హమీద్, డీఆర్‌డీఓ ఎం.వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డి.లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్‌ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీపీలు చిరంజీవి ప్రసాద్, అనిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ పి.సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎం.శివకుమార్, కె.మాణిక్‌రావు, ఎంపీడీఓలు రాములు, లక్ష్మీబాయి, ఎల్లయ్య, ఈఓపీఆర్‌డీలు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి, సాయిబాబా, యాదయ్య, మహిళా సంఘాల సభ్యులు, ఈజీఎస్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

గ్రామాలను దత్తత తీసుకోవాలి : ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్‌

వందశాతం మరుగుదొడ్ల లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్ధీన్‌ కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా పాటు పడాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలను నిర్వహించినట్లయితే లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో అందుకోవచ్చన్నారు. 
అభివృద్ధి పనులపై సమీక్ష...
జహీరాబాద్‌ : జహీరాబాద్‌ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్దీన్‌తో కలిసి మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, విద్యుత్‌ శాఖ పనుల ప్రగతిని గురించి ఆయా శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు.  సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్ధీన్, ఆర్డీఓ అబ్దుల్‌ హమీద్, మార్కెట్‌ చైర్మన్‌ డి.లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్‌ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీపీ చిరంజీవి ప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు