జనవరి 4 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ 

12 Nov, 2017 02:24 IST|Sakshi

     దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సర్వే 

     పారిశుద్ధ్యం స్థితిగతుల ఆధారంగా 2,000 మార్కులు 

     రాష్ట్రంలోని పట్టణాలకు మంచి ర్యాంకు కోసం కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌:  పారిశుద్ధ్య స్థితిగతులపై మధింపు జరిపి ర్యాంకులు కేటాయించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వచ్చే ఏడాది జనవరి 4 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ –2018ను నిర్వహించనుంది. మార్చి చివరితో ఈ సర్వే ముగియనుంది. గతేడాది దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాల్లో ఈ సర్వేను నిర్వహించి ర్యాంకులు కేటాయించగా, ఈ సారి దేశ వ్యాప్తం గా అన్ని నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌–2017లో జాతీయ స్థాయిలో జీహెచ్‌ఎంసీ 22, వరంగల్‌ 28, సూర్యాపేట 30, సిద్దిపేట 45వ ర్యాంకులను సాధించాయి. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలు గత సర్వేలో 200 పైనే ర్యాంకులు సాధించాయి. దీంతో వచ్చే జనవరి నుంచి ప్రారంభం కానున్న సర్వేకు రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధిం చేందుకు అమలు చేయాల్సిన సంస్కరణలు, చేయాల్సిన పనులను వచ్చే తక్షణమే చేపట్టాలని రాష్ట్రంలోని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. నిర్దేశించిన పనులు చేపట్టేందుకు నిధులు లేని మునిసిపాలిటీలు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ సూచించింది.  

పురపాలికల నివేదికలే కీలకం  
స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మునిసిపాలిటీలు కేంద్ర పట్టణా భివృద్ధి శాఖకు సమర్పించే నివేదికలే కీలకం కానున్నాయి. ఈ సర్వేను మూడు భాగాలుగా విభజించి నిర్వహించనుండగా, తొలి భాగం కింద మునిసిపాలిటీలు సమర్పించే నివేదికలకు 900 మార్కులు, రెండో భాగం కింద సర్వే నిర్వహణ ఏజెన్సీలు నేరుగా పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులను పరిశీలించి మదింపు జరపడం ద్వారా 500 మార్కులు, మూడో భాగం కింద స్థానిక పౌరుల నుంచి స్వీకరించే అభిప్రాయాల ఆధారంగా 600 మార్కులను కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో మునిసిపాలిటీలు సమర్పించే పారిశుద్ధ్య నివేదికలను పకడ్బందీగా రూపొందించాలని మునిసిపల్‌ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా, మొత్తం 2,000 మార్కుల్లో.. నగర, పట్టణ ప్రాంతాల్లో చెత్తసేకరణ, రోడ్లను ఊడ్చటం, చెత్త రవాణాకు తీసుకుంటున్న చర్యలకు 40% మార్కులు, మునిసిపల్‌ వ్యర్థాల నిర్వహణ, చెత్త నిర్మూలన చర్యలకు 20%మార్కులు, బహిరంగ మల విసర్జన నిర్మూలన, టాయిలెట్లకు 30% మార్కులు, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పనకు తీసుకుంటున్న చర్యలకు 5% మార్కు లు, సంస్థాగత నిర్మాణం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ పోర్టల్‌ వినియోగించుకుంటు న్న తీరుకు 5% మార్కుల్ని కేటాయిస్తారు. కేంద్ర సంస్థ క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ మదింపు జరగనుంది.  

మరిన్ని వార్తలు