చెంబురాజు..చెత్తరాజు!

26 Sep, 2019 06:02 IST|Sakshi

దాతలకు అవార్డులు.. దారితప్పిన వారికి జరిమానాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నుంచి సోమవారం (30వ తేదీ) వరకు ‘స్వచ్ఛసర్వేక్షణ్‌ ’కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా చెత్తసేకరణ, నిర్వహణ, తడి, పొడి చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరుచేస్తారు. అధికారులు పల్లెల్లో బృందాలుగా విడిపోయి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో చెత్తబుట్టలు ఉండేలా చర్యలతో పాటు, ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంప్‌ యార్డులను తరలిస్తారు. ఈ యార్డుల్లో కంపోస్ట్‌ ఎరువు తయా రీ, బహిరంగ మలవిసర్జన చేయకుండా చూడడం వంటివి అమలు చేస్తారు.

దాతలకు వైవిధ్య గుర్తింపు..
గ్రామాల అభివృద్ధికి రూ.లక్ష అంతకు మించి డబ్బు లేదా వస్తు రూపేణా ఇచ్చిన దాతల పేరును ఏడాదిపాటు నోటీస్‌ బోర్డుపై ఉంచడంతో పాటు వారికి ‘మా ఊరి మహారాజపోషకులు’గా పరిగణించాలని వివిధ గ్రామ పంచాయతీలు నిర్ణయించాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష ఆపైనా డబ్బు లేదా వస్తురూపేణా ఇచ్చే దాతల పేర్లను నోటీస్‌ బోర్డుపై నెలరోజులపాటు ఉంచి ‘మా ఊరి మహారాజు’గా గుర్తిస్తారు. రూ.5 నుంచి రూ.10 వేలు ఆపైనా ఇచి్చన దాతల పేరును నోటీసుబోర్డుపై వారం పాటు ఉంచడంతో పాటు‘మా ఊరి రాజు’గా వ్యవహరిస్తారు.

ఇక బహిరంగ మల విసర్జనకు పాల్పడే వారికి రూ.500 వరకు జరిమానా విధించాలని వివిధ గ్రామపంచాయతీలు, గ్రామసభలు నిర్ణయించాయి. ఈ పనికి పాల్పడేవారికి ‘చెంబురాజు’గా పిలుస్తారు. రోడ్లపై, బహిరంగస్థలాల్లో చెత్తాచెదారం పారవేసే వారికి ‘చెత్తరాజు’గా నిర్ణయించారు. చెత్తా చెదారం, వ్యర్థాలు ఆరుబయట, రోడ్లపై, బహిరంగస్థలాల్లో వేసే వారికి కూడా రూ.500 వరకు జరిమాన వేస్తారు. విద్యుత్‌ దొంగతనానికి పాల్పడేవారికి ‘దొంగరాజు’గా వ్యవహరించనున్నారు. బుధవారం నుంచే ఇవి అమలులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు